Sonia Gandhi: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురాబోతోంది. సోమవారం మోడీ అధ్యక్షతన మంత్రి మండలి ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్రం తీసుకువస్తోంది. అయితే బిల్లును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పింది.
అయితే ఈ బిల్లు తమదే అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ దీని కోసం గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన సమయంలో మీడియా అడిన ప్రశ్నకు సోనియాగాంధీ మహిళా బిల్లు తమదే అని సమాధానం ఇచ్చారు. అంతకుమందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్(ట్విట్టర్)లో బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కేంద్రం ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నట్లు, బిల్లులోని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు.. అఖిలపక్షం సమావేశంలో దీని గురించి చర్చించి ఉండవచ్చు. గోప్యంగా పనిచేయడానికి బదాులుగా ఏకాభిప్రాయం ద్వారా బిల్లును తీసుకురావచ్చు’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Aditya L1: భూమికి గుడ్ బై.. సూర్యుడి దిశగా 15 లక్షల కి.మీ ప్రయాణం..
ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే అది యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్, మిత్ర పక్షాల విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నప్పుడు బిల్లును 10 ఏళ్లు ఎందుకు తీసుకురాలేదని, 2024 ఎన్నికల కోసమే అనే అనుమానాన్ని మరో సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. యూపీఏ ప్రభుత్వం 2010 మార్చి 9న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యసభ దీనికి ఆమోదం తెలిపింది. అయితే లోకసభలో బిల్లు చర్చకు రాలేదు.