Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది చివర్లలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని, తెలంగాణలో బహుషా గెలవవచ్చని అన్నారు. రాజస్థాన్ లో విజయం సాధించే అవకాశం ఉందని, బీజేపీతో పోటీ ఉంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో విజయం సాధించదనే విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. తెలంగాణలో బీజేపీ పతనమైందని ఆయన అన్నారు.
Read Also: Health Tip: డెంగ్యూ బారిన పడి రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందా? ఇలా పెంచుకోండి
బీజేపీ అంతర్గతంగా కూడా ఇవే ఫలితాలు ఉంటాయని ఊహిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.కూటమి గురించి మాట్లాడుతూ.. మేం దేశంలో 60 శాతం ఉన్నామని, 2024 ఫలితాలు బీజేపీని ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఫలితాలను కాంగ్రెస్ నియంత్రిస్తుందని, రాజస్థాన్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత గురించి.. ఆ రాష్ట్ర ప్రజల్ని అడిగితే ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నామని చెబుతారని రాహుల్ గాంధీ అన్నారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ..కులగణన డిమాండ్ పై ప్రజల మనస్సులను మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో ప్రజల కోసం స్పష్టమైన విజన్ ఇచ్చామని అన్నారు.