Asim Munir: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పాకిస్తాన్, దాని మిలిటరీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు బుద్ధి రావడం లేదు. మరోసారి మునీర్ భారత్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే పాకిస్తాన్ వేగంగా, తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ‘‘ఏదైనా దురాక్రమణ జరిగితే పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుంది. భారత్ ఎలాంటి భ్రమల్లో ఉండకూడదు’’ అని గత వారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్) పదవిని స్వీకరించిన అసిమ్ మునీర్ అన్నారు.
Read Also: Satya Kumar Yadav: డ్రగ్స్ పైన నిఘా పెట్టాలి.. చీటీ లేకుండా మందులు ఇస్తే కఠిన చర్యలు!
26 మంది టూరిస్టుల ప్రాణాలు బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాది’’ తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై డెడ్లీ అటాక్స్ చేసింది. పాకిస్తాన్, పీఓకేలోని జైషే మహ్మద్, లష్కరేతోయిబా కార్యాలయాలు, వాటి శిక్షణా కేంద్రాలపై దాడులు చేసిన వందలాది ఉగ్రవాదుల్ని హతం చేసింది. కవ్వింపులకు దిగిన పాక్ సైన్యానికి భారత్ తన దెబ్బను చూపించింది. పాక్ ఎయిర్ బేసుల్ని టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్స్ చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం భారత్ ముందు మోకరిళ్లింది.
తన సైనిక అధికారుల సమావేశంలో మునీర్ మాట్లాడుతూ.. పాక్ శాంతియుత దేశమని, కానీ ఇస్లామాబాద్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరీక్షించడానికి ఎవరినీ అనుమతించబోమని హెచ్చరించారు. పాక్-ఆఫ్ఘాన్ సంఘర్షణపై మాట్లాడుతూ.. ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఫిత్నా అల్ ఖవరిజ్( పాక్ తాలిబాన్లు), పాకిస్తాన్ మధ్య ఎవరో ఒకరిని ఎంచుకోవడం తప్పా మార్గం లేదని ఆయన అన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్‌ను “ఫిత్నా అల్-ఖవారీజ్”గా ప్రకటించింది, ఇది ఇస్లామిక్ చరిత్రలో హింసకు పాల్పడిన ఒక సమూహాన్ని సూచిస్తుంది.