India-Pakistan tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. భారత్‌తో యుద్ధానికి మేము సిద్ధమని, మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రభుత్వంలోని మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నిజానికి యుద్ధం వస్తే పాకిస్తాన్ వద్ద 4 రోజులకు సరిపోయే మందుగుండు సామాగ్రి మాత్రమే ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, ఆర్థిక సంక్షోభం, అప్పుల కుప్పగా మారిన పాకిస్తాన్ పదే పదే యుద్ధ భాష మాట్లాడుతోంది.
యుద్ధానికి వెళ్తే పాక్ పరిస్థితి అడుక్కోవడమే..
తాజాగా, మూడీస్ రేటింగ్స్ సంస్థ సంచలన నివేదిక పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో చెప్పింది. భారత్‌తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ కి ఇక ‘‘భిక్షాటన’’ గతి అవుతుందని, పాక్ చేతిలో ఖాళీ బొచ్చే మాత్రమే ఉంటుందని పరోక్షంగా వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఈ ఉద్రిక్తత చాలా కాలం పాటు కొనసాగితే, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుందని, దాని ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని మూడీస్ తెలిపింది. ఇది ప్రభుత్వ ఆర్థిక ఏకీకరణ ప్రక్రియను దెబ్బతీస్తుందని, ఇది పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వానికి పెద్దా ముప్పుగా మారుతుందని వెల్లడించింది.
ప్రస్తుతం ఉద్రిక్తత పాకిస్తాన్ బాహ్య నిధులను పొందే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని మూడీస్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో దాని బాహ్య రుణాలు చెల్లిచండానికి విదేశీ మారక నిల్వలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ రుణాలు పొందడం కూడా పాక్‌కి కష్టమవుతుందని చెప్పింది. ఇటీవల కాలంలో పాక్ ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల కనిపించినట్లు మూడీస్ చెప్పింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, జీడీపీ నెమ్మదిగా పెరగడం, ఐఎంఎఫ్ షరతులకు అనుగుణంగా ఉండటం కొంత ఉపశమనాన్ని అందించాయని చెప్పింది. కానీ ప్రాంతీయంగా అశాంతి, ఉద్రిక్తత పెరిగితే మెరుగుదల స్థిరంగా ఉండదని చెప్పింది.
భారత్ బలంగా ఉంది:
ఇక భారత్ విషయాని కూడా మూడీస్ ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని మూడీస్ నివేదిక చెప్పింది. భారత వృద్ధి రేటు స్థిరంగా ఉందని, ప్రభుత్వం పెట్టుబడులు పెరగడంతో పాటు దేశీయ మార్కెట్లో బలమైన వినియోగదారుల వ్యయం కనిపిస్తోందని చెప్పింది. ఇక పాకిస్తాన్‌తో భారత్ వాణిజ్యం తక్కువగా ఉంది కాబట్టి ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపించదని చెప్పింది. సరిహద్దు ఉద్రిక్తత పెరిగితే, రక్షణ వ్యయం మరింతగా పెరుగుతుందని, సైనిక ఖర్చు పెంచాల్సి వస్తుందని భారత్ గురించి మూడీస్ చెప్పింది. అయితే, ఇది భారత ఆర్థిక స్థిరత్వంపై స్వల్ప ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పింది. మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పింది.