PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు.
‘‘తమిళ భాష, తమిళ వారసత్వం ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కొన్నిసార్లు తమిళనాడు నేతలు రాసే లేఖల్లో తమిళంలో సంతకం ఉండకపోవడాన్ని చూసి నేనే ఆశ్చర్యపోతాను. వారిలో ఎవరూ తమిళంలో సంతకం చేయరు. మనం తమిళం గురించి గర్వపడితే, ప్రతీ ఒక్కరూ కనీసం తమిళంలో సంతకం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని రామేశ్వరంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Gujarat: ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడంపై మందలించిన తల్లి.. 16 ఏళ్ల బాలిక సూసైడ్..
కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం(NEP)లోని త్రిభాషా సూత్రం వివాదంగా మారిన నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అధికార డీఎంకే నేతలతో పాటు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం హిందీని తమిళనాడుపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం తమిళ భాష, సంస్కృతిని బెదిరిస్తోందని వాదించాడు. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పేద కుటుంబాల పిల్లలు కూడా వైద్యులు కావాలనే వారి కలను నెరవేర్చడానికి తమిళనాడు ప్రభుత్వాన్ని తమిళ భాషలో వైద్య కోర్సులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని మోడీ కోరారు. మన దేశ యువత వైద్యులు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసుకునే మా ప్రయత్నమని, గత 10 ఏళ్లలో తమిళనాడుకు 11 కొత్త వైద్య కళాశాలలు వచ్చాయని మోడీ అన్నారు.
తమిళనాడు కొత్త విద్యా విధానాన్ని అంగీకరించకపోవడంతో రూ. 2000 కోట్ల నిధులు నిలిచిపోయాయని అధికార డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అందించే నిధులు పెరిగాయని, తమిళనాడు అనేక కేంద్ర పథకాల నుంచి ప్రయోజనం పొందిందని మోడీ అన్నారు. గత దశాబ్దంలో రాష్ట్ర రైల్వేకి బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని ప్రధాని చెప్పారు. 2014కి ముందు ప్రతీ ఏడాది తమిళనాడుకు రూ. 900 కోట్లు మాత్రమే కేటాయించారని, అయితే, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్‌కి రూ. 6000 కోట్లు దాటిందని, అదనంగా రామేశ్వరంలో స్టేషన్‌తో సహా 77 రైల్వే స్టేషన్లను అనుకరిస్తోందని చెప్పారు.