Gujarat: తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. 11వ తరగతి చదువుతున్న బాలిక తల్లి మందలించిన రెండు రోజుల తర్వాత ఈ ఘటనకు పాల్పడింది. బాలిక, తన తమ్ముడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంది. తన కుమార్తె క్రమం తప్పకుండా తన ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడాన్ని తల్లి అభ్యంతరం చెప్పింది. ఆమె తన సొంత వాహనాన్ని ఉపయోగించకుండా, నీపై ఎందుకు ఆధారపడుతుందని తల్లి కుమార్తెని ప్రశ్నించింది.
Read Also: R. Krishnaiah: కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యుడు
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి వితంతువు. సంఘటన జరిగే సమయంలో ఆమె సమీపంలోని ఇళ్లకు పనికి వెళ్లింది. తిరిగి వచ్చే సమయానికి కూతురు ఉరి వేసుకుని ఉండటం చూసింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్లు అధికారులు చెప్పారు. బాలిక తన తల్లికి ‘‘అమ్మా, మీ కూతురు మీ నియంత్రణలో లేదు. అందరూ సంతోషంగా ఉండాలి. నేను వెళ్తున్నా’’ అని లేఖ రాసింది. తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ.. ‘‘లవ్ యూ మా’’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. నివేదికల ప్రకారం, కూతురు తన స్నేహితురాలితో కలిసి తరుచూ విహారయాత్రలకు వెళ్లడం గురించి ఆమెను తిట్టినట్లు సమాచారం. పోలీసులు ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.