Himachal: నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది. అయితే, దీనిపై ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ, ఈ విరాళం స్వచ్ఛందంగా అందించబడిందని, ఇది సుఖ్ ఆశ్రయ్ పథకం కింద అనాథలకు భవన నిర్మాణ సౌకర్యాల కోసం అని చెప్పారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజా విమర్శలు వచ్చాయి. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆలయ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ, నిధులను పంపాలని కోరుతోందని ఆరోపించారు. ‘‘ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తోంది, హిందూ వ్యతిరేక కామెంట్స్ చేస్తోంది. మరోవైపు దేవాలయాల నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ పథకాలకు నడపాలని అనుకుంటోంది. దేవాలయాలు, ట్రస్టులతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి’’ అని మాజీ సీఎం ఠాకూర్ అన్నారు.
Read Also: Officer on Duty Trailer: మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ విడుదల..
గత నెలలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ రాసిన లేఖలో, ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన మరియు ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనకు ఆలయ ట్రస్టులు నిధులు సమకూర్చడానికి మార్గదర్శకాలను వెల్లడించింది. గతేడాది ఆగస్టులో సుఖు ప్రభుత్వం, ఆయన మంత్రి వర్గం జీతభత్యాలను చెల్లించడాన్ని 2 నెలలు వాయిదా వేస్తామని చెప్పింది. దీంతో రాష్ట్రంలోని ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 2023 నుంచి ఆ రాష్ట్రాన్ని కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. 2024 ఆగస్టులో కులు, సిమ్లాలో ‘‘క్లౌడ్ బరస్ట్’’ జరిగింది. ఆకస్మిక వరదలతో 30 మందికి పైగా మరణించారు. ఇతర జిల్లాలతో కలిపి మొత్తం 100 మందికి పైగా మరణించారు. మొత్తం నష్టం రూ. 842 కోట్లు. 2023లో రూ. 10,000 కోట్ల నష్టం వాటిల్లింది.