Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
శుక్రవారం మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూమెంట్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించింది. సాలిడారిటీ యూవ్ మూమెంట్ అనేది జమాతే ఇస్లామీ యూత్ వింగ్. అయితే ఈ ర్యాలీలో హమాస్ నాయకుడు ఒకరు ప్రజలను ఉద్దేశిస్తూ వర్చువల్ గా మాట్లాడటంపై వివాదం చెలరేగింది. ఈ ఘటనను రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఖండించారు. కేరళ పోలీసులు తీరును ఆయన ప్రశ్నించారు. ఇలా హమాస్ ఉగ్రవాద నాయకుడు ఈ ర్యాలీలో మాట్లాడటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Rojgar Mela 2023: 51 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని
సురేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘మలప్పురంలో సంఘీభావ కార్యక్రమంలో హమాస్ నాయకుడు ఖాలీద్ మషేల్ వర్చవల్ గా పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. పినరయి విజయన్ కేరళ పోలీసులు ఎక్కడ ఉన్నారు..? సేవ్ పాలస్తీనా ముసులో వారు హమాస్ ఉగ్రవాద సంస్థను కీర్తిస్తున్నారు. వారిని నాయకులు, యోధులుగా చెప్పడం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.
ఇదిలా ఉండగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పాలస్తీనా మద్దతు ర్యాలీలో కాంగ్రెస్ నేత శశిథరూర్ పాల్గొనడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీన్ని హమాస్ అనుకూల కార్యక్రమంగా పేర్కొంది. పాలస్తీనా కోసం కోజికోడ్ లో 10 వేల మంది ఐయూఎంఎల్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించడంపై మాట్లాడుతూ.. ఇది మరపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడానికి ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 7న గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి ప్రజలను ఊచకోత కోశారు. మరణించిన వారిలో పసిపిల్లల నుంచి పండుముసలి వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. మరో 200 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై వరసగా దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే మరణాల సంఖ్య 7000లను దాటింది. ఉగ్రవాదులతో సహా సాధారణ పాలస్తీనా ప్రజలు కూడా మరణిస్తున్నారు.