Girl Fall in Borewell: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం 12 ఏళ్ల బాలిక 500 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 5 గంటల పాటు ఆర్మీ, పోలీసు బృందాలు శ్రమించి ఎట్టకేలకు ఆ బాలికను రక్షించారు. ఈ ఘటన ధృంగాధ్ర తహసీల్‌లోని గజన్వావ్ గ్రామంలో చోటుచేసుకుంది. జూన్‌లో రెండేళ్ల బాలుడిని బోరుబావి నుంచి రక్షించిన తర్వాత తహసీల్‌లో ఇది రెండో ఘటన. మనీషా అనే బాలిక ఉదయం 7.30 గంటల సమయంలో పొలంలో ఉన్న బోర్‌బావిలో పడిపోయిందని ఓ అధికారి తెలిపారు.
దాదాపు ఐదు గంటల ప్రయత్నాల తర్వాత స్థానిక పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయంతో ఆర్మీ జవాన్లు ఆమెను రక్షించారని ధృంగాధ్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ టీబీ హిరానీ వెల్లడించారు. దాదాపు 500-700 అడుగుల లోతున్న బోరుబావిలో బాలిక 60 అడుగుల లోతులో చిక్కుకుపోయిందని ఆమె తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, బాలికకు ఆక్సిజన్ సరఫరా చేయడంతో పాటు లోపల ఉంచిన కెమెరా ద్వారా ఆమె పరిస్థితిని పర్యవేక్షించారని పేర్కొన్నారు. బాలికను రక్షించిన వెంటనే, ఆర్మీ వైద్య బృందం ఆమెకు ఆక్సిజన్ అందిస్తూ ధృంగాధ్రలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెను రక్షించిన అనంతరం ఆమెలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని గ్రహించి.. వెంటనే ఆక్సిజన్ అందించామని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందన్నారు.
Fire Accident: 15 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి
బాలికను రక్షించడంతో ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ఆర్మీ, పోలీసు బృందాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించాయని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేడీ పురోహిత్ తెలిపారు. జూన్ 2న ధృంగాధ్రలోని పొలంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోవడంతో ఆర్మీ బృందాన్ని రప్పించారు. దాదాపు మూడు గంటల తర్వాత బాలుడిని రక్షించారు.