Ghosi Bypoll: అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమికి మధ్య తొలిపోరు ఖరారైంది. ఇందుకు వేదికగా ఘోసి ఉపఎన్నిక మారనుంది. ఉత్తర్ ప్రదేశ్ ఘోసి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, టీఎంసీ వంటి మొత్తం 30కి పైగా ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టాయి.
బుధవారం ఘోసి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలే రెండు కూటముల మధ్య తొలిపోరుగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ తన అభ్యర్థిగా సుధాకర్ సింగ్, బీజేపీ అభ్యర్థి దారా సింగ్ చౌహాన్ పై పోటీకి చేయనున్నారు. సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్ఎల్డీ పార్టీలు మద్దతు తెలిపాయి.
Read Also: Khalistan Referendum: ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ.. రెఫరెండానికి కెనడా అనుమతి నిరాకరణ..
సమాజ్ వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దారాసింగ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరుపున ఎన్నికల్లో నిలబడ్డారు. బీజేపీ, తన మిత్రపాలైన అప్నాదళ్(సోనేవాల్), నిషాద్ పార్టీ మద్దతు కూడగట్టుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ నేతృత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై ఈ ఎన్నిక పెద్దగా ప్రభావం చూపదు. అయితే ఇండియా కూటమి తమ బలం ఏ మేరకు ఉందో అని పరీక్షించుకోబోతోంది.
రానున్న లోకసభ ఎన్నికల ముందు ఇండియా కూటమి బలాన్ని చూపాలని అనుకుంటోంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ చాలా కీలక రాష్ట్రం ఈ రాష్ట్రంలో 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ ప్రభావం, మోడీ హవా తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
ఘోసీలోని దాదాపు 4.38 లక్షల మంది ఓటర్లలో 90,000 మంది ముస్లింలు, 60,000 మంది దళితులు , 77,000 మంది “అగ్రవర్ణాల” నుండి ఉన్నారు. ఉపఎన్నిక కోసం బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్, సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.