Sandeshkhali: లోక్‌సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన పలువురు నేతులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటంతో అక్కడి మహిళలు తిరగబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్‌ని అరెస్ట్ చేయాలంటూ ఉద్యమించారు. అయితే, 55 రోజుల పరారీ తర్వాత కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఇతడిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
జనవరి 5న ఈడీ అధికారులపై టీఎంసీ నేతలు చేసిన దాడి కేసులో ప్రస్తుతం సీబీఐ ఆ ప్రాంతంలోని ఓ ఇంటిపై దాడులు చేసింది. సందేశ్‌ఖాలీలోని సర్బేరియా ప్రాంతంలోని స్థానిక తృణమూల్ నాయకుడు హఫీజుల్ ఖాన్ బంధువైన ఒకరి ఇంటిపై సీబీఐ రైడ్స్ నిర్వహించింది. కేంద్ర భద్రతా బలగాల సాయంతో సీబీఐ నిర్వహించిన ఈ దాడుల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అనేక బాంబుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను గుర్తించేందుకు బాంబు స్కానింగ్ పరికరాలను కూడా తీసుకుని వచ్చారు.
Read Also: Konda Visveshwar Reddy: చేవెళ్ల మేనిఫెస్టోను విడుదల చేసిన కొండా.. ‘సంకల్ప పత్రం’ పేరిట రిలీజ్
మహిళలపై అఘాయిత్యాలు, భూ కబ్జాలు, హింసకు పాల్పడుతున్న కేసుల్లో ప్రధాన నిందితుడిగా టీఎంసీ మాజీ నాయకుడు షేక్ షాజహాన్ ఉన్నారు. రేషన్ కుంభకోణంపై విచారణ జరిపేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు జనవరి 5న దాడి చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా షాజహాన్ దురాగతాలు బయటకు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఇతడిని ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసే అధికారం ఉందని తీర్పు చెప్పిన ఒక రోజు తర్వాత బెంగాల్ పోలీసులు 55 రోజులు పరారీలో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అయితే, ఇతడికి సీఎం మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. ఇతడి అరెస్ట్ తర్వాత టీఎంసీ తన పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్ చేసింది.