Ayodhya Ram Temple: దాదాపు 500 ఏళ్ల హిందువుల కల నేటితో తీరింది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా దేశంలోని అతిరథులు, లక్షల మంది ప్రజలు హాజరవ్వగా.. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపుగా 400 స్తంభాలు, 44 తలుపులతో అయోధ్య రామ మందిరం నిర్మితమైంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, స్పోర్స్ట్ సెలబ్రెటీలు, ఇతర రంగాల్లో ప్రముఖులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే 500 ఏళ్ల కాలంలో రామ మందిర విషయంలో జరిగిన ప్రముఖ ఘట్టాలను చోటు చేసుకున్నాయి.
1528: బాబ్రీ మసీదు ప్రారంభం:
మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ అయిన మీర్ బాకీ 1528లో బాబ్రీ మసీదును నిర్వించడంతో రామ మందిర ఉద్యమం ప్రారంభమైంది. మసీదు హిందూ దేవాలయం శిథిలాలపై నిర్మించాలనే నమ్మకం మధ్య ఇరు వర్గాల మధ్య అనేక చర్యలు, ఘర్షణలు జరిగాయి.
1751: మరాఠాల వాదన:
భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన రచయిత మరియు మాజీ రాజ్యసభ ఎంపి బల్బీర్ పుంజ్ తన పుస్తకం ‘ట్రైస్ట్ విత్ అయోధ్య: డీకోలనైజేషన్ ఆఫ్ ఇండియా’లో, మరాఠాలు అయోధ్య, కాశీ మరియు మథురలపై నియంత్రణ సాధించాలని కోరుకున్నారని రాశారు.
1858: నిహాంగ్ సిక్కుల డిమాండ్.
1858లో నిహాంగ్ సిక్కులు బాబ్రీ మసీదును రాముడి జన్మస్థలంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వివాదాస్పద స్థల నియంత్రణ కోసం పోరాటానికి నాంది పలికింది. దీని వల్ల చాలా సంఘర్షణలు తలెత్తాయి.
2019 సుప్రీంకోర్టు తీర్పులో కూడా నిహాండ్ బాబా ఫకీర్ సింగ్ ఖల్సా, 25 మంది నిహాంగ్ సిక్కులతో కలిసి మసీదు ఆవరణలో చొరబడి, మసీదు ఉన్న ప్రేదశం రాముడి జన్మస్థలం అని వాదించారని పేర్కొంది.
1885: మొదటి లీగల్ పిటిషన్:
నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్ 1885లో మసీదు బయటి ప్రాగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ న్యాయపరమైన పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి బ్రిటీష్ ప్రబుత్వం హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు ప్రార్థనా స్థలాలను గుర్తి్స్తూ కంచెవేసింది. దాదాపు 90 ఏళ్ల పాటు ఇది ఇలాగే ఉంది.
1949: బాబ్రీ మసీదు లోపల ‘రామ్ లల్లా’ విగ్రహాలు
డిసెంబర్ 22, 1949 రాత్రి బాబ్రీ మసీదు లోపల ‘రామ్ లల్లా’ విగ్రహాలు ఉంచడం, ఈ ప్రాంతం ఇరు వర్గాల మధ్య మతపరమైన భావాలను తీవ్రతరం చేయడంతో, దాని యాజమాన్య హక్కుల కోసం న్యాయపోరాటాలు ప్రారంభమయ్యాయి. మసీదు లోపల విగ్రహాలు కనిపించాయని హిందువులు పేర్కొన్నారు. దీంతో తొలిసారి ఈ ఆస్తి వివాదం కోర్టుకు వెళ్లింది.
1950-1959: చట్టపరమైన పిటిషన్లు
ఈ కాలంలో వివాదాస్పద రామ జన్మభూమిపై చట్టపరమైన పిటిషన్లు పెరుగుతూ వచ్చాయి. నిర్మోహి అఖారా విగ్రహాలను పూజించి హక్కులను కోరింది. మరోవైపు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరింది. దీంతో ఈ సమస్య మరింత జఠిలమైంది.
1986-1989: బాబ్రీ మసీదు తాళాలు తెరిచారు.
1986లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో బాబ్రీ మసీదు తాళాలను తెరిచారు. హిందువులను లోపల పూజలు చేసుకునేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. రామ జన్మభూమి వివాదం దేశంతో ఒక కీలక ఘట్టంగా మారింది.
విశ్వహిందూ పరిషత్ (VHP) 1990లో రామమందిర నిర్మాణానికి డెడ్‌లైన్ విధించింది. దీంతో దేశవ్యాప్తంగా దేవాలయం కోసం డిమాండ్లు పెరిగాయి. ఇదే కాలంలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది.
వీహెచ్‌పీ, బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుకోవడం రామ మందిర నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు.
1990: రథయాత్ర, బాబ్రీ కూల్చివేతకు విఫలయత్నం
మండల్ కమిషన్ అమలు, దేశంలో రాజకీయ ఉద్రిక్తల మధ్య అద్వానీ 1990లో రథయాత్ర మొదలుపెట్టి, ఆలయానికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మసీదు కూల్చివేతకు విఫలయత్నం చేశారు. ఇది కీలక మలుపుగా నిలిచింది.
1992: బాబ్రీ కూల్చివేత
అయోధ్య రామ మందిర నిర్మాణంలో బాబ్రీ మసీదు కూల్చివేత చారిత్రక విషయంగా దేశ చరిత్రలో నిలిచిపోయింది. హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. దీని తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. భారత రాజకీయాలను ప్రభావితం చేశాయి.
1993-1994: కూల్చివేత అనంతర అల్లర్లు
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా మతహింస చోటు చేసుకుంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టం ఏర్పడింది. వివాదాస్పద ప్రాంతాన్ని PV నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని డాక్టర్ ఇస్మాయిల్ ఫరూఖీ సవాలు చేశారు. ఇది 1994 సుప్రీంకోర్టు తీర్పుకు దారి తీసింది. ఈ తీర్పులో వివాదంలో రాష్ట్ర ప్రమేయాన్ని బలపరిచింది.
2002-2003: ASI తవ్వకం, అలహాబాద్ హైకోర్టు విచారణ:
అలహాబాద్ హైకోర్టు ఈ కేసును విచారించడం ప్రారంభించింది. మసీదు కింద హిందూ ఆలయం ఉన్నట్లు రుజువు చేస్తూ ఆర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదిక వెల్లడించింది.
2009-10: లిబర్‌హాన్ నివేదిక
16 ఏళ్లలో 399 సిట్టింగ్‌ల తర్వాత, లిబర్‌హాన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన క్లిష్టమైన వివరాలను వెల్లడిస్తూ, కీలక నేతల ప్రయేమయాన్ని వెల్లడించింది. లిబర్‌హాన్ కమిషన్ జూన్ 2009న తన నివేదికను సమర్పించింది – ఎల్‌కె అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు ఇతర బిజెపి నాయకుల పేర్లతో, 17 ఏళ్ల తర్వాత విచారణ ప్రారంభమైంది.
అలహాబాద్ హైకోర్టు యొక్క 2010 తీర్పు హిందువులు, ముస్లింలు మరియు నిర్మోహి అఖారా మధ్య భూమిని విభజించడం ద్వారా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది.
2019 సుప్రీంకోర్టు తీర్పు:
500 ఏళ్ల పోరాటానికి స్వస్తి పలుకుతూ రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తం వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగిస్తూ, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది.
2020: రామమందిర శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న బాబ్రీ మసీదు స్థలంలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
2024, జనవరి 22: ఆలయ ప్రారంభం
జనవరి 22, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. రామ మందిరం ప్రారంభమైంది.