ఆ మంత్రి మెరుపు తీగలా మాయమవుతాడు. పాదరసంలా జారుకుంటాడు. అవసరం వుంటేనే జిల్లాలో వాలిపోతాడు. ఇప్పుడా అవసరం ఏంటనే చర్చ…అనవసర రాద్దాంతం అవుతోంది. చివరికి మినిస్టర్‌కే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎంతకీ ఎవరా అమాత్యుడు? మంత్రి అనగాని సత్యప్రసాద్ చిక్కడు..దొరకడు అన్నట్టుగా తెగ ఫీలవుతున్నారు తిరుపతి జిల్లా తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి జిల్లానైనా, లేదంటే విడిగా తిరుపతి జిల్లా చూసుకున్నా మంత్రి పదవి మాత్రం స్థానిక నేతలకు దక్కలేదు. ఆ తర్వాత జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే అందరితోనూ కలిసి పని చేస్తారని అనుకున్న నేతలు…ఆయన్ను ముద్దుగా మంత్రి డార్లింగ్ అంటూ పలకరించేవారు. డార్లింగ్ తీరు మొదట్లో బాగానే వున్నా…రానురాను ఆయన నల్లపూస అయ్యారని చాలా బాధపడిపోతున్నారు. అసలే పదవులు ఆలస్యంగా రావడం, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కిందిస్థాయి నేతలు తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ మంత్రిపై మరింత ఆగ్రహంగా ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఒకటి రెండుసార్లు అలా తళుక్కుమన్న మంత్రి…తర్వాత అటు రావడమే మానేశారట. ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కనపడ్డంలేదంటూ సోషల్ మీడియా వేదికగా తమ్ముళ్లు బాధను వెళ్లగక్కుతుండటం ప్రత్యర్థి పార్టీలకూ ఆయుధమవుతోంది. తమ పనుల సంగతి సరే కనీసం పార్టీనైన పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ మరికొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో హాట్ టాపికయ్యింది. తిరుపతి కేంద్రంగా పరకామణి కేసు, తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ కేసు విచారణ జోరుగా సాగుతోంది. వైసీపీ మీద చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నుంచి కూడా ఎదురుదాడి ఓ రేంజ్‌లో సాగుతోంది. ముఖ్యంగా భుమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అటాక్‌కు కనీసం విమర్శల రూపంలో కూడా తిప్పి కొట్టే ధైర్యం జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు చేయలేకపోతున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన బాధ్యత మంత్రికి లేదా అంటున్నారు తమ్ముళ్లు. కరుణాకర్ రెడ్డి టీటీడీని ఉద్దేశించి ప్రభుత్వంపై పలుమార్లు ఆరోపణలు చేసినా..ఏ ఒక్కరోజు కూడా ఇన్చార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వాటిని ఖండించిన దాఖలాలు లేవంటున్నారు. ఇక ఆయన గతంలో పర్యటించిన సమయంలో స్థానిక నేతలు ఇచ్చిన విజ్ఞప్తుల సంగతి ఏమైందో ఆ వెంకన్న స్వామికి కూడా తెలియదంటూ సెటైర్లు వేస్తున్నారు.
తిరుపతిలో ఇన్చార్జిగా ఉన్న సుగుణమ్మ ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అనేలా వ్యవహరిస్తుండటంతో ఆమెకు చాలావరకు పార్టీ నేతలు, క్యాడర్ దూరంగా ఉంది. దీంతో గ్రూపుల గోల తిరుపతిలో ఓ రేంజ్ లో ఉంది. తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కోఆర్డినేటర్ గా ఉన్న శంకర్ రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యే అదిమూలం అనుచరుల రోడ్డెక్కి కొట్టుకోవడం రచ్చరచ్చ అయ్యింది.
ఆదిమూలంను పార్టీ నుంచి బహిష్కరించినా ఇప్పటికీ వారి అనుచరులు చేస్తున్న పనులు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయని పలుమార్లు మంత్రికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందట. ఇక గూడూరు ,వెంకటగిరి, సూళ్లూరుపేట తమ్ముళ్ల ఆవేదన అలాగే వుంది.
ఎమ్మెల్యేలకు చెబితే పని జరగదని, మంత్రి కోసం ఎదురుచూస్తే ఆయన మాత్రం జిల్లా వైపు కన్నెత్తు చూడటం లేదని గుర్రుగా ఉన్నారు నేతలు. మొన్నటికి మొన్న పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే పోలీసులు దానిని హత్యగా నిర్ధారించారు. కరుణాకర్ రెడ్డి మాత్రం సతీష్ ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అంటూ తీవ్రస్థాయిలో రివర్స్ ఎటాక్ చేసినప్పటికీ…జిల్లాలో ఎమ్మెల్యేలు మాత్రం మౌనంగానే ఉండిపోయారు. తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ అంటూ హడావిడి చేస్తే ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రెస్ మీట్ కు డుమ్మా కొట్టడం, మంత్రి పట్టించుకోకపోవడం తమ్ముళ్లను ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాగే వ్యవహరిస్తే..పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని స్థానిక నేతలు రగిలిపోతున్నారు. మరికొందరు నేతలు మాత్రం ఆయనకు పార్టీ ఎందుకని, ఆయనకు కావాల్సిన పనుల కోసం మాత్రం జిల్లాకు వస్తారంటూ సెటైర్లు వేస్తున్నారట. ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారినా రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆనంద రెడ్డి పోస్టింగ్ వెనుక అనగాని సత్యప్రసాదే ఉన్నారని… దాని వెనుక భారీగానే డబ్బులు చేతులు మారాయని కూడా కొందరు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. పలు భూ సమస్యల పరిష్కారం కోసం చుట్టపుచూపుగా జిల్లాకు వస్తున్నారు తప్ప పార్టీ కేడర్ సమస్యలు, ఆయన పట్టించుకోవడంలేదని బహిరంగంగానే తమ్ముళ్లు విమర్శించడం కూటమి నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. మా డార్లింగ్ ఎక్కడ అంటూ వెటకారంగా మాట్లాడుకుంటున్నారు.