Online Cricket Betting: గుంటూరు జిల్లాలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 22 బ్యాంక్ బుక్స్, 11 చెక్కులు, 30 ఏటీఎం కార్డులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. చినకాకాని ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్ వెనుక ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్‌లోని ఒక ప్లాట్‌లో క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది అన్నారు. దీంతో సోదాలు చేపట్టి కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం.. బాలు, ప్రవీణ్, సూర్య పారిపోయారు.. ఈ ముగ్గురిపై నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
అయితే, ఇందుకూరి బాలకృష్ణ రాజు, ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాశ్‌లను అరెస్టు చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి 6 లక్షల 30 వేల రూపాయల నగదుతో పాటు ఐదు ల్యాప్‌టాప్‌లు, 32 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నాం. ఇక, ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్‌లైన్ గేమింగ్‌కు అలపడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింక్‌ను నమ్మి www.hublibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తేలింది.. తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు గుర్తించాం.. క్రికెట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి మోసగించేవారు.. డిపాజిట్లు, విత్‌డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ లాంటి కార్యకలాపాలకు పాల్పడినందుకు నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.