Off The Record: సెక్రటేరియట్ గోడలకు చెవులు పెరిగిపోయాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అలా చర్చించి, చర్చించగానే ఇలా కొన్ని బయటపడుతున్నాయి. ప్రతిపక్షాలకు ఆయుధాలవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి లీకుల భయం పట్టుకుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని ఘటనలు మర్చిపోక ముందే మళ్ళీ ప్రభుత్వ సమాచారం క్షణాల్లో ప్రతిపక్షాలకు చేరుతోంది. ప్రభుత్వంలోని ముఖ్య శాఖల్లో జరిగే నిర్ణయాలు బయటకు లీక్ అవుతున్నాయని భావిస్తున్నారు. అంతర్గత సమావేశాల సారాంశం ప్రభుత్వ పెద్దల కంటే ముందే ప్రతిపక్షానికి ఎలా చేరుతున్నాయో తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లీకేజీలు ఇంటి దొంగల పనేనా లేక ప్రతిపక్షం ముందుగానే విషయాన్ని పసిగట్టి స్పందిస్తోందా? అనే విషయాలు తెలుసుకునే పనిని నిఘా వర్గాలకు అందించినట్లు తెలుస్తోంది.
READ ALSO: Online Cricket Betting: ఏపీలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్!
తాజాగా పరిశ్రమల శాఖలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు గులాబీ లీడర్లకు క్షణాల్లో చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. వాటి ఆధారంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారనే టాక్. ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీని ఆమోదించారు. ఈ పాలసీ విధివిధానాలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఆ లోపే దాని పూర్తి వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులకు అందినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు చేసినట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జీవో రూపంలో లేదా సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు వెల్లడిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావు. కానీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశం మొత్తం గులాబీ లీడర్లకు వెంటనే చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం పరిశ్రమల శాఖ రూపొందించిన హిల్టప్ పాలసీని ఆమోదించారు. దీంతో ఇండస్ట్రియల్ పార్కుల్లోని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అందుకు సబ్ రిజిస్ట్రార్ నిర్దేశించిన భూముల ధరల్లో 30% సొమ్మును యజమానులు ఫీజుగా టీజీఐఐసీకి చెల్లించాలి. ఈ పాలసీకి సంబంధించిన విధివిధానాలు తయారు చేసి ఆ శాఖ సెక్రెటరీ ఆమోదించిన తర్వాత జీవో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ లోపే కొందరు ఆఫీసర్లు డిటెయిల్స్ అన్నీ గులాబీ పార్టీ నేతలకు చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. వాటిని ఆధారంగా చేసుకుని సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీ భూముల బదిలీ పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు కాంగ్రెస్ పాలకులు తెరలేపారని ఆరోపించారు.
తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై అందరి దృష్టి పడింది. మొన్నటి వరకు కాళేశ్వరం కమీషన్ విచారణ… నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లు ఏసీబీకి దొరకడం… తాజాగా ఆ శాఖలో నిర్ణయాలు ప్రతిపక్షానికి చేరుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నా… అధికారులు ఇంకా బిఆర్ఎస్ నేతలకే వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. అటు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు వెనువెంటనే ప్రతిపక్షానికి చేరగా… ఇరిగేషన్ శాఖలో మంత్రి రాసిన లేఖ ఢిల్లీకి చేరక ముందే బిఆర్ఎస్ నేతలకు చేరడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టు, కేఆర్‌ఎంబీ నిర్ణయాలు, కాళేశ్వరం మేడిగడ్డ, తాజాగా బనకచర్ల ఇష్యూ.. ఇలా ఏది చూసినా.. ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య సమాచారం మొత్తం కొందరు ఇంజినీర్లు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వ రహస్యాలు ముందుగానే తెలియడంతో అధికార పార్టీ ఎత్తుగడలు, వ్యూహాలను వారు ముందే పసిగట్టి సర్కారును ఇరకాటంలో పెడుతున్నారని అధికారులు చర్చించుకుంటున్నారు. ఒక్కోసారి ప్రభుత్వమే సెల్ఫ్‌డిఫెన్స్‌లో పడాల్సి వస్తోందని, ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోవడం, వివరణలు ఇచ్చుకోవడం.. కొన్ని సార్లు రాజకీయంగానూ తమకు నష్టం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
నీటిపారుదల శాఖలో బీఆర్‌ఎస్ కోవర్టులు ఇంకా ఉన్నారని ప్రభుత్వ, అధికార వర్గాలు భావిస్తున్నాయి. సర్కారు తీసుకునే నిర్ణయాలు, శాఖాపరంగా కొత్తగా చేస్తున్న ఆలోచనలు ముందుగానే గులాబీ పార్టీ నేతలకు చేర వేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలు కేంద్రానికి చేరక ముందే ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రికి చేరాయని అధికారులు భావిస్తున్నారు. ఆ లేఖలోని అంశాన్ని బట్టే ఆయన పవర్‌పాయింట్‌ప్రజెంటేషన్ ఇచ్చారనే చర్చ ఇరిగేషన్ శాఖలో సాగుతోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం చేరవేస్తున్న సదరు ఇంజినీర్లను గుర్తించేందుకు పనిలో సర్కారు నిమగ్నమైంది.
READ ALSO: Pregnant Women Health Tips: శీతాకాలంలో గర్భిణుల ఆరోగ్యానికి నిపుణుల సూచనలు ఇవే..