ప్రస్తుత రోజుల్లో చిన్న స్మార్ట్‌ఫోన్ దిరికితేనే.. జేబులో వేసుకుని పోతున్నారు జనాలు. కాస్త కాస్ట్‌లీ ఫోన్ దొరికితే ఊరుకుంటారా?.. గుట్టుచప్పుడు కాకుండా సైడ్ చేస్తారు. అందులోనూ ఐఫోన్ దొరికే.. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంటికి తీసుకెళుతారు. అయితే అందరూ ఇలా ఉండరు. నూటికో, కోటికో ఒక్కరు మనసున్న మహారాజు కూడా ఉంటాడు. అందులో ఒకడే ఆంధ్రకు చెందిన ఆటో డ్రైవర్ స్వామి. తనకు కాస్ట్‌లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం స్వామి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది.
సీను (S e e N u-SrinivasFitness) అనే ఎక్స్ యూసర్ నవంబర్ 20న రాత్రి ఓ పోస్ట్ చేశాడు. ‘నా భార్య తన ఐఫోన్‌ను పోగొట్టుకుంది. మేము 10 సార్లకు పైగా కాల్ చేసాము. ఎవరో ఒకసారి కాల్ చేసి హిందీలో మాట్లాడారు. వారు దానిని స్విచ్ ఆఫ్ చేశారు. నా భార్యకు ఆమె iCloud పాస్‌వర్డ్ గుర్తులేదు కాబట్టి Find My Phoneని ఉపయోగించలేము. ఫోన్ కనుకుంనేందుకు వేరే మార్గం ఉందా ?’ అని పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజు మరో పోస్ట్ చేస్తూ తన భార్య ఐఫోన్ దొరికినట్లు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో తన భార్య పోగొట్టుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇచ్చినందుకు ఓ ఆటో డ్రైవర్‌ను సోషల్ మీడియాలో ప్రశంసించాడు.
Also Read: iQOO 15 Pre Bookings: లాంచ్‌కు ముందే ఐకూ 15 ప్రీ-బుకింగ్‌లు.. ఫ్రీ ఇయర్‌బడ్‌లు, ఏడాది అదనపు వారంటీ!
‘మొబైల్ తిరిగి వచ్చింది. ఆటో డ్రైవర్ స్వామికి ధన్యవాదాలు. నా భార్య ఐఫోన్ స్విచ్ ఆఫ్ అయి రాత్రంతా ఆటోలోనే ఉంది. ఉదయం స్వామి ఆటోను శుభ్రం చేస్తున్నప్పుడు ఐఫోన్ చూశాడు. ఫోన్‌ను ఛార్జ్ చేసి నా భార్య వాల్ పేపర్‌ను చూశాడు. వెంటనే మా ఇంటికి వచ్చి ఐఫోన్ ఇచ్చేశాడు. స్వామి మంచి మనసుకి ధన్యవాదాలు’ అని సీను చెప్పుకొచ్చాడు. ఈ పోస్టుకు మొబైల్, స్వామి పోటోలను జత చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. విషయం తెలిసిన నెటిజెన్స్ స్వామి మంచి మనసును పొగుడుతున్నారు. మనసున్న మహారాజు, డ్రైవరన్నా.. నువ్ రాజువయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.