AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తులో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.
Read Also: Rajasthan: మసీదు సమీపంలో రోడ్డు ప్రమాదం, మూకదాడిలో ఒకరు మృతి.. మత ఉద్రిక్తత..
‘‘ఏఐఎడీఎంకే-బీజేపీ కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏఐఏడీఎంకే నేతృత్వంలో ఉంటుంది. ప్రభుత్వం కూడా తమ పార్టీ ద్వారానే ఏర్పాటు చేయబడుతుంది’’ అని పళనిస్వామి అన్నారు. జూలై 7 నుంచి కోయంబత్తూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పళనిస్వామి ప్రకటించారు. డీఎంకేను అధికారం నుంచి తొలగించాలని అనుకుంటున్న వారందరికి కూటమిలోకి స్వాగతం అని అన్నారు. విజయ్ పార్టీని ఆహ్వానిస్తారా అని ప్రశ్నించినప్పడు ఈపీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే, టీవీకే పార్టీ తరుపున విజయ్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. తమ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా డీఎంకే, బీజేపీలతో పొత్తు పెట్టుకోదని విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ వేరే ప్రాంతాల్లో ఏది చేసినా, తమిళనాడులో ఏమీ చేయలేదని చెప్పారు. భావ వైరుధ్యం ఉన్న పార్టీలో పొత్తు ప్రశ్నే లేదని వెల్లడించారు.