Siddaramaiah: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజల్ని కోరారు. శనివారం కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీజేపీలా కాకుండా, కాంగ్రెస్ ఎల్లప్పుడు మాటపై నిలబడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రజల్ని కోరారు. ‘‘నరేంద్రమోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని నేను మిమ్మల్ని వినయంగా కోరుతున్నాను’’ అని సిద్ధరామయ్య అన్నారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ మేనిఫేస్టోలో “ముస్లిం లీగ్” ఆలోచనలు.. దేశాన్ని విడగొట్టే యత్నం..
కోలార్‌లో కురుదుమలే గణపతి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఓటమి భయంతో బీజేపీ సృష్టిస్తున్న అబద్ధాల జోలికి వెళ్లవద్దని ప్రజల్ని కోరారు. మోడీ ప్రభుత్వం (కేంద్రం) పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్లు, ఎరువులు, వంట నూనెలు, పప్పులు మరియు కూరగాయల ధరలను పెంచిందని సిద్ధరామయ్య ఆరోపించారు. దేశంలోని ప్రతీ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని ఆరోపించిన సీఎం.. ఈ కష్టాల నుంచి ప్రజల్ని రక్షించేందుకు మేము ఐదు హామీలను ప్రకటించి, అమలు చేస్తున్నామని అన్నారు. ఈ హామీల అమలు సాధ్యం కాదని బీజేపీ అబద్ధాలు చెప్పిందని, కానీ హమీలను అమలు చేసిన తర్వాత కొత్త అబద్ధాలను సృష్టిస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు.