Election Commission: దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే రికార్డు స్థాయిలో ఇంత మొత్తం నగదును ఇదే తొలిసారని ఎన్నికల సంఘం చెబుతోంది. మార్చి 1 నుంచి రోజూ రూ. 100 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. మొత్తంగా రూ. 4,650 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఇది 2019 పార్లమెంటరీ ఎన్నికల కన్నా ఎక్కువ.
2024 సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నందున, దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, బోర్డర్ చెక్‌పోస్టులు తమ పనిని 24 గంటలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. నగదు, మద్యం, ఉచితాలు, డ్రగ్స్, మాదకద్రవ్యాల తరలింపు పంపిణీ జరగకుండా కృషి చేస్తున్నామన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.