Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓపికపట్టండి.. తదుపరి బీఎంసీ ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు సూచించారు ఠాక్రే.
Read Also: Bandi Sanjay : రజాకార్ల పాలనను తరిమికొడతా
తన పార్టీ చిహ్నం విల్లు-బాణాన్ని దొంగిలిచారని.. దొంగకు బుద్ది చెప్పాలని సీఎం ఏక్ నాథ్ షిండేను ఉద్దేశిస్తూ విమర్శించారు. వారికి బాలాసాహెబ్ ఠాక్రే ముఖం కావాలి.. ఎన్నికల గుర్తు కావాలి కానీ శివసేన కుటుంబం అక్కరలేదని.. మహారాష్ట్రకు రావాలంటే ప్రధాని నరేంద్రమోడీకి బాలాసాహెబ్ ఠాక్రే ముసుగు అవసరం అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏ ముఖం నిజయో, ఏది కాదో అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. దొంగలకు పవిత్రమైన విల్లు-బాణం గుర్తు ఇచ్చారు. కావాలంటే వాళ్లు టార్చ్(మషాల్) గుర్తును కూడా తీసుకోవచ్చని.. వారు నిజమైన మాగాళ్లే అయితే విల్లు-బాణం గుర్తతో మా ముందుకు రండి.. మేము టార్చ్ తో ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఇది మాకు పరీక్ష అని, యుద్ధం మొదలైందని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.
గతేడాది శివసేనలో చీలిక కారణంగా అధికారంలో ఉన్న శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)- కాంగ్రెస్- ఎన్సీపీల మహావికాస్ అఘాడీ కూటమి కూలిపోయింది. మొత్తం 56 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు ఇచ్చారు. దీంతో ఏక్ నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే శివసేన రెండు వర్గాల మధ్య పార్టీ, ఎన్నికల చిహ్నంపై గత ఏడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ ఎవరికి చెందుతుందనే దానిపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏక్ నాథ్ షిండే వర్గానికే పార్టీ, ఎన్నికల గుర్తు చెందుతుందని ఆదేశాలు జారీ చేసింది.