Eknath Shinde: హిందుత్వ సిద్ధాంతాలకు కేరాఫ్‌గా ఉన్న శివసేన(యూబీటీ), ఉద్ధవ్ ఠాక్రే క్రమక్రమంగా ఈ సిద్ధాంతాలను వదిలేస్తుందని శివసేన(షిండే) నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా, శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఉద్ధవ్, హిందుత్వాన్ని, బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారని ఆరోపించారు.
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని, బాలాసాహెబ్ ఠాక్రే ఆదర్శాలకు పూర్తిగా వెన్నుపోటు పొడిచారని షిండే అన్నారు. ఉద్ధవ్ వైఖరి అతడి సైద్ధాంతిక గందరగోళాన్ని బహిర్గతం చేయడంతో పాటు, అతడి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కప్పేసిందని షిండే అన్నారు. వక్ఫ్ బిల్లుపై ఠాక్రే వైఖరి, ఆ పార్టీ నేతల్ని కూడా నిరాశ పరిచిందని అన్నారు.
READ ALSO: Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
బిల్లుపై తన వ్యతిరేకతకు హిందుత్వతో కారణం లేదని, కానీ బీజేపీ కపటత్వాన్ని వ్యతిరేకించడం మాత్రమే అని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఆయన సైద్ధాంతిక అస్థిరతను వెల్లడిస్తుందని షిండే అన్నారు. ‘‘ఉద్ధవ్ పరిస్థితి ఎలా ఉందంటే అతడు దేనైనా పట్టుకుంటే అది కాటేస్తుంది, విడిచిపెడితే పారిపోతుంది’’ అని షిండే ఎద్దేవా చేశారు.
బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ జాతీయవాద ముస్లింలు, దేశ వ్యతిరేక శక్తుల మధ్య తేడాలను గుర్తించారని, శివసేన బీజేపీ కూడా నిరంతరం ఈ విధానాన్ని సమర్థించాయని షిండే అన్నారు. రాహుల్ గాంధీ ప్రభావంతో ఉద్ధవ్ ఠాక్రే మహ్మద్ అలీ జిన్నాలా మారుతున్నారని దుయ్యబట్టారు. హిందుత్వం పట్ల తన పార్టీ శివసేన బాలా సాహెబ్ ఠాక్రే, ధర్మవీర్ ఆనంద్ దిఘే దార్శనికతకు కట్టుబడి ఉంటుందని షిండే ప్రకటించారు. ఉద్ధవ్ ఠాక్రే 2019లో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్న దాని కన్నా అతిపెద్ద ద్రోహం వక్ఫ్ బిల్లు విషయంలో చేశారని షిండే అన్నారు.