అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దేశంలోకి ఎదోవిధంగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద నుంచి అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద 13.26 కోట్ల విలువ చేసే 947 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా నుంచి ఢిల్లీ చేరుకున్న 26 ఏళ్ల ప్రాసెస్ టి సుమో అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. యువతి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో యువతిని అధికారులు ప్రశ్నించారు. యువతి లగేజ్ బ్యాగ్ లో దాచిన డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇథియోపియా నుంచి తీసుకువచ్చిన వచ్చిన కుర్తీస్ లో డ్రగ్స్ ను గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ ను బిళ్లలుగా తయారు చేసి మహిళలు ధరించే కుర్తీస్ బటన్ లో దాచింది ఖిలాడీ లేడీ. 272 బటన్స్ లో దాచిన కొకైన్ ను బయటకు తీశారు అధికారులు. దాదాపు 4 గంటలకు పైగా అధికారులను ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరకు నేరాన్ని అంగీకరించింది. యువతిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు అధికారులు.
ఇదిలా ఉంటే శంషాబాాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేకప్ కిట్, కుర్తాస్ లో దాచిన బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.