దేశ అత్యున్నత పదవి, రాజ్యంగ అత్యున్నత పదవిని స్వీకరించబోతున్నారు ద్రౌపది ముర్ము. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా సోమవారం పదవిని స్వీకరించనున్నారు. 21 గన్ సెల్యూల్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. పదవీ స్వీకారం తరువాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
ఈ రోజు రాష్ట్రపతి పదవికి రామ్ నాథ్ కోవింద్ రాజీనామా చేయనున్నారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అక్కడే కొత్త రాష్ట్రపతికి ఇంటర్ సర్వీసెక్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు.
Read Also: Chhattisgarh: పోలీస్ కానిస్టేబుల్ నిజాయితీ.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు అప్పగింత
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. దేశంలోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తరువాత రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 64 శాతం మంది మద్దతు పొందారు. స్వాతంత్య్రం తరువాత జన్మించి… అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా పదవిని స్వీకరిస్తున్న మహిళగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు.
ఇదిలా ఉంటే శనివారం ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాస్వామ్య గొప్పతనం గురించి భావోద్వేగ ప్రసంగం చేశారు రామ్ నాథ్ కోవింద్. దేశాభివృద్ధికి రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని సూచించారు.