MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీని హెచ్చరిస్తూ సందేశం పంపాడు సీఎం స్టాలిన్. ‘‘మమ్మల్ని రెచ్చగొట్టకండి. డీఎంకే లేదా దాని కార్యకర్తలను రెచ్చగొట్టవద్దు. ఇది బెదిరింపు కాదు హెచ్చరిక’’ అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చాడు.
పదేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై తొందరపడి బాలాజీని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. తాను దర్యాప్తును తప్పు అని చెప్పడం లేదని, కానీ అతను సామాన్య వ్యక్తి కాదని, ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అని, అతడిని ఉగ్రవాదిలా లాక్కెళ్లి ఎందుకు ప్రశ్నించాలి..? అని స్టాలిన్ ప్రశ్నించారు. సెంథిల్ బాలాజీపై ఈడీ ఒత్తడి తెచ్చిందని.. దీంతోనే అతడికి ఛాతి నొప్పి వచ్చిందని స్టాలిన్ అన్నారు.
Read Also: Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు బీజేపీని వ్యతిరేకించే వారిపైనే జరుగుతున్నాయని, బెదిరించే వ్యూహాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీకి బెదిరించడం అలవాటుగా మారిందని, వివిధ రాష్ట్రాల్లోని ఒకే స్క్రిప్టుతో భారతదేశం అంతటా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. శివసేన వ్యతిరేకిస్తే సంజయ్ రౌత్ ని అరెస్ట్ చేశారు, ఆప్ వ్యతిరేకిస్తే మనిష్ సిసోడియాను అరస్ట్ చేశారు, బీమార్ లో తేజస్వీ యాదవ్ పై దాడులు నిర్వహించారని ఆయన అన్నారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి, అతడిని అరెస్ట్ చేసింది. ఉద్యోగానికి నగదు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కి పాల్పడినట్లు సెంథిల్ పై అభియోగాలు ఉన్నాయి. రాష్ట్ర రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో కలిసి ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకునేందుకు సెంథిల్ బాలాజీ ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ తన రిమాండ్ నోట్‌లో పేర్కొంది. డ్రైవర్లు, కండక్టర్లు, జూనియర్ ట్రేడ్స్‌మెన్‌లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లు తదితర ఉద్యోగాల్లో అభ్యర్థులను నియమించుకునేందుకు బాలాజీ అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది.