Mamata Banerjee: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి సర్ ప్రక్రియను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో మహిళల పేర్లు తొలగిస్తే, వారంతా వంటగదిలో వాడే పనిముట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు.
‘‘ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను మీరు లాక్కుంటారా.? ఎన్నికల సమయంలో వారు ఢిల్లీ నుంచి పోలీసులను తీసకువచ్చి మహిళల్ని బెదిరిస్తారు. మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర వంటింటి సాధానాలు ఉన్నాయి కదా.? మీరు వంట చేయడానికి వాడే పనిముట్ల మీకు బలం కాదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా.? మహిళలు ముందుండి పోరాడతారు, పురుషులు వారి వెనకాల ఉంటారు’’అని బెంగాల్‌లోని కృష్ణనగర్ లో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో అన్నారు.
మహిళలు లేదా బీజేపీనా? వీరిలో ఎవరు శక్తివంతులో చూడాలని అనుకుంటున్నట్లు ఆమె అన్నారు. ‘‘నేను మతతత్వాన్ని నమ్మనని, నేను లౌకిక వాదాన్ని నమ్ముతాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా, బీజేపీ డబ్బును ఉపయోగించి, ప్రజలను విభజించడానికి ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది’’ అని ఆరోపించారు. దెబ్బతిన్న పులి చాలా ప్రమాదకరమని, మాపై దాడి చేస్తే ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తెలుసు అంటూ మమతా హెచ్చరించారు. తన ప్రభుత్వం బెంగాల్ నుంచి ఎవరిని వెళ్లగొట్టేందుకు అనుమతించదని, ‘‘సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల వద్దకు మాత్రం వెళ్లవద్దు, ఇదే నా విన్నపం’’ అని అన్నారు.
Read Also: Pakistan: కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్.. మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష..
ఆదివారం కోల్‌కతాలో జరిగిన సామూహిక భగవద్గీ పారాయనం గురించి మాట్లాడుతూ.. ‘‘మనకు అవసరమైనప్పుడు మనమందరం ఇంట్లోనే గీతను పఠిస్తాము. బహిరంగ సభ ఎందుకు నిర్వహించాలి? దేవుళ్లు హృదయంలో ఉంటారు. అల్లాను ప్రార్థించేవారు తమ హృదయాలలోనే ప్రార్థిస్తారు. రంజాన్, దుర్గా పూజ సమయంలో, మనమందరం కలిసి ప్రార్థిస్తాము. గీత గురించి అరుస్తున్న వారిని శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో అడగాలనుకుంటున్నాను. ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి.. హింస వివక్ష, విభజన కాదు’’ అని మమతా బెనర్జీ అన్నారు.
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజలను విభజించలేదని, మీరు ఎవరు ? అని బీజేపీని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు తాము భారత పౌరులమని నిరూపించుకోవలని అన్నారు. మీరు చేపలు తినాలా, మాంసం తినాలా అని మీరే నిర్ణయించుకుంటారని, బీజేపీ మిమ్మల్ని వాటిని తిననివ్వదని అన్నారు.