PM Modi: ఇటీవల పాకిస్తాన్‌ని, పీఓకేని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లాలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ వారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వీరిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం హర్యానా అంబాలాలో విరుచుకుపడ్డారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే, శత్రువు కూడా ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు అని అన్నారు. ప్రస్తుతం అదే పాకిస్తాన్‌ని కలవరపెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. 70 ఏళ్లుగా తమ చేతిలో బాంబులు పెట్టుకుని, ఇప్పుడు భిక్షాటన గిన్నె పట్టుకుని ఉన్నారని, ఇది బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైనందని, శత్రువులు ఇలాగే వణికిపోతారని ప్రధాని చెప్పారు.
Read Also: Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
బలహీనమైన ప్రభుత్వం ఉంటే జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని మార్చగలిగేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఉగ్రవాదుల దాడుల్లో, రాళ్ల దాడుల్లో మన సైనికులు గాయపడటం చూసి హర్యానాలోని తల్లులు ఆందోళన చెందే వారని, గత 10 ఏళ్ల కాలంలో ఇదంతా ఆపగలిగాం అని, బలమైన ప్రభుత్వం ఆర్టికల్ 370ని బద్ధలు కొట్టిందని, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉందని ప్రధాని అన్నారు.
ఇటీవల పీఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుందనే బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, మనం వారిని గౌరవించాలి, లేకపోతే భారత్‌పై వారు అణుబాంబు ప్రయోగించాలని ఆలోచిస్తారు, మీరు వారితో చర్చించాలి, కానీ సైనిక శక్తిని పెంచుతున్నామని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ పీఓకేని తీసుకుంటే పాకిస్తాన్ గాజులు తొడుక్కుని లేదని, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. హర్యానాలో మొత్తం 10 స్థానాలకు మే 25న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.