ఓవైపు కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్‌తో విజృభింస్తుంటే చాలా మంది కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ ఎవరూ మాస్క్ ధరించకపోయినా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కెమెరాలకు పని చెబుతున్నారు. ఫోటో తీయడం వారికి జరిమానా విధించడం .. ఎక్కడ లాఠీలకు పనిచెప్పాల్సిన అవసరం లేదు.
గడిచిన రెండు రోజుల్లో కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 1.5 కోట్ల రూపాయల జరిమానాలు వసూలు చేశారు. కోవిడ్ రూల్స్ బ్రేక్‌కు సంబంధించి 163 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా మాస్క్‌లు ధరించకపోవడం, గుమిగూడిన ఘటనలే అధికంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎక్కడా ఎవ్వరిని వదిలిపెట్టబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒమిక్రాన్ కట్టడికి ఖచ్చితంగా అందరూ రూల్స్ పాటించాల్సిందేనని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.