ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Fake Employee: టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ సీసీసీ సెంటర్లోకి వెళ్లిన కేటుగాడు
ఇక ముఖ్యమంత్రి రేసులో పలువురు నేతలు ఉన్నారు. పరిశీలనలో పర్వేష్ వర్మతో పాటు ఓ మహిళను కూడా ఎంపిక చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించిన శిఖా రాయ్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆశిస్ సూద్ (ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ), రేఖా గుప్తా, విజేందర్ గుప్తా (ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత), సతీష్ ఉపాధ్యాయ్ (బ్రాహ్మణ నేత, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు), జితేంద్ర మహాజన్ (వైశ్య నేత) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మంత్రి పదవుల కోసం దాదాపు 15 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sheikh Hasina vs Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షేక్ హసీనా ప్రతిజ్ఞ.. ముహమ్మద్ యూనస్ కౌంటర్
ఈ నెల 20న రాంలీలా మైదానంలో అత్యంత గ్రాండ్‌గా ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇక ఈ ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలను, పారిశ్రామిక వేత్తలను, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపాలని భావిస్తోంది. బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాలు హాజరుకానున్నారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రోగ్రామ్‌కి హాజరుకానున్నారు. మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాష్ ఖేర్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన జరగనుంది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీస్ సిసోడియా లాంటి నేతలు ఓడిపోయారు. అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కింది.
ఇది కూడా చదవండి: Nabha Natesh: మొక్కుబడిగా చేసిన ఆ పనిని ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా : నభా నటేష్