Fake Employee: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సీసీసీ (కంప్రెహెన్సివ్ కోఆర్డినేషన్ సెంటర్) కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు రాకపోకలు నిర్వహించడం పోలీసులను అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ అనుమానాస్పద వ్యక్తి అక్కడ తిరుగడం హాట్‌టాపిక్‌గా మారింది. సీసీసీ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తిని గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మొదట అతను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకున్నా, చివరకు ఆ ఫేక్ ఉద్యోగి జ్ఞాన సాయి ప్రసాద్ గా పోలీసుల విచారణలో తెలిసింది.
Read Also: Sheikh Hasina vs Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షేక్ హసీనా ప్రతిజ్ఞ.. ముహమ్మద్ యూనస్ కౌంటర్
సీసీసీ సెంటర్ ఎదురుగా ఉన్న ఒక హోటల్‌లోకి వెళ్లిన జ్ఞాన సాయి ప్రసాద్, అక్కడ వ్యాపార లావాదేవీల పేరుతో గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. గోవర్ధన్ నుంచి మొత్తం మూడు లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఎం సమీక్షలు జరుగుతున్న సమయంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మూడుసార్లు రావడం, తిరిగి వెళ్లడం పై అధికారులు తీవ్రంగా స్పందించారు. హోటల్‌తో పాటు సీసీసీ సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు.