దేశంలో రోజు రోజుకు క్రిప్టో కరెన్సీపై కొన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు సైతం పెట్టారు. దీనిపై భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ స్పందించారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థికస్థిరత్వానికి క్రిప్టో కరెన్సీ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీపై అప్రమత్తంగా లేకుంటే అనర్థాలు తప్పవన్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్యను ఎక్కువగా చేసి చెబుతున్నారన్నారు. ప్రస్తుతం క్రిప్టో క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఫలితంగా ట్రేడింగ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్న సమయంలో గవర్నర్ శక్తి కాంత దాస్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది క్రిప్టో మార్కెట్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి.
మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేస్తున్న వారి సంఖ్య దేశంలో పది కోట్లు దాటింది. గతంలో క్రిప్టో కరెన్సీని ఆర్బీఐ నిషేధించింది. సుప్రీం కోర్టు ఆ నిషేధాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ట్రేడింగ్ పెరిగింది. 2021, ఫిబ్రవరి 5న సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ విధానంపై ఓ అంతర్గత కమిటీ వేసింది. ప్రస్తుతానికైతే క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేయలేదు. కానీ దీనిపై స్టాక్ హోల్డర్లు, అధికారులు, మంత్రిత్వ శాఖల మధ్య నిరంతరం చర్చలు జరుగుతు న్నాయి. భవిష్యత్‌లో క్రిప్టో కరెన్సీ ఎలాంటి పాత్రను పోషిస్తుందో వేచి చూడాలి మరీ..