Nagpur Violence: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో అగ్గిరాజేస్తోంది. నాగ్‌పూర్‌లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక్కసారి ముస్లిం మూక దాడులకు పాల్పడింది. దీంతో నగరంలో హింస చెలరేగింది. ప్రైవేట్ ఆస్తులు, వాహనాలు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు ‘‘కుట్ర’’ ప్రకారం జరిగాయని, మణిపూర్ జాతి ఘర్షణలను ప్రస్తావిస్తూ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ‘‘నిర్ధిష్ట ఇళ్లు, స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ముందస్తుగా కుట్ర పన్నారు’’అని షిండే అన్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ, ఔరంగజేబు మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం గురించి ‘‘ఛావా’’ సినిమా ప్రజల కోపాన్ని రగిలించిందని అన్నారు.
సోమవారం సాయంత్రం వ్యాప్తించిన పుకార్లే హింసకు కారణమని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ‘‘ఒక రాళ్ల ట్రాలీ వచ్చింది, ఇది ప్లాన్‌ని సూచిస్తుంది. నిర్దిష్ట ఇళ్లు, సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌పై గొడ్డలితో దాడి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిని వదిలిపెట్టేది లేదు. పోలీసులపై హింసను సహించము’’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ‘‘విశ్వహిందూ పరిషత్ ఔరంగజేబు సామాధిని తొలగించాలని ఆందోళన నిర్వమించింది. గడ్డితో చేసిన ఒక నమూనా సమాధిని తగులబెట్టారు. అయితే, సమాధిపై మతపరమైన వ్యాఖ్యలు ఉన్నాయనే పుకార్లు వ్యాప్తించాయి. నమాజ్ తర్వాత 250 మంది జన సమూహం నినాదాలు చేయడం ప్రారంభించింది.’’ అని జరిగిన సంఘటనా క్రమాన్ని సీఎం చెప్పారు. వీహెచ్‌పీపై ముస్లింల ఫిర్యాదుని అంగీకరించినట్లు తెలిపారు.
Read Also: MLAs’ Wealth Analysis: దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు.. ఈ 3 రాష్ట్రాలలోనే అధికం…
మరోవైపు, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం ఫడ్నవీస్‌కి మద్దతు ఇచ్చారు. ఒక నిర్ధి్ష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ముందస్తుగా కుట్ర పన్నారని ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల షిండే మాట్లాడుతూ.. దేశభక్తులైన ముస్లింలు ఔరంగజేబుకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని అన్నారు. ఆయనను ప్రశంసించే వారు దేశద్రోహులని, ఛత్రపతి శంభాజీ నగర్( ఔరంగాబాద్) లోని ఔరంగజేబు సమాధి మహారాష్ట్రకు మచ్చ అని తీవ్రంగా స్పందించారు. ‘‘ఔరంగజేబు ఎవరు? ఆయన సాధువా? ఆయన ఏదైనా మంచి పని చేశారా? ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర చదివి ‘ఛావా’ చూడాలి. వారు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను 40 రోజులు హింసించారు. ఔరంగజేబు ఒక దేశద్రోహి… ఛత్రపతి శంభాజీ మహారాజ్ గర్వం కోసం నిరసనకారులు నిరసన తెలుపుతున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శివసేన ఎంపీ నరేష్ మష్కే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో అల్లర్లు జరుగుతాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ఇది వారి కుట్రలా కనిపిస్తోందని అనుమానించారు. మరోవైపు, ఠాక్రే సేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రని మణిపూర్‌లా చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఠాక్రే సేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా ఇది బీజేపీ కుట్ర అంటూ ఆరోపించారు.