Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు.
గత 12 రోజుల్లో హజారీబాగ్, రామ్‌గఢ్, ఛత్రా, లోహర్‌దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపినట్లు అనుమానిస్తున్న ఏనుగును పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిపుణుల బృందాన్ని నియమించిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికర్ సామంత వెల్లడించారు. రాంచీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నేతృత్వంలో నాలుగు డివిజన్‌ల అటవీ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, మొత్తం 16 మందిని ఒకే ఏనుగు చంపిందా అని కమిటీ నిర్ధారిస్తుందని అన్నారు.
Read Also: Joe Biden: ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..
సోమవారం లోహర్‌దగా జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని, ఆదివారం ఒకరిని ఏనుగు తొక్కి చంపింది. సోమవారం రాత్రి రాజధాని రాంచీకి 25 కిలోమీటర్ల దూరంలో ఇట్కీ బ్లాక్‌లోకి ప్రవేశించిందని, మంగళవారం ఉదయం ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారని, ఒకరికి గాయాలు అయ్యాయని అటవీ అధికారులు వెల్లడించారు. 12 రోజుల క్రితం ఇదే ఏనుగు హజారీబాగ్‌లో ఐదుగురిని చంపి, ఆపై రామ్‌గఢ్‌కు ప్రాంతానికి వెళ్లిందని.. అక్కడ గోలా ప్రాంతంలో ఒక వ్యక్తిని తొక్కేసి చంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 3.75 లక్షల పరిహారం ఇస్తామని.. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25,000 అందిస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. 2021-22లో ఏనుగు దాడుల్లో 133 మంది చనిపోయారని, 2020-21లో 84 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2017 నుంచి ఐదేళ్ల వ్యవధిలో 462 మంది చనిపోయారు.