P Chidambaram: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వస్తాయని, 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో సీట్లు పెరుగుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం శనివారం అన్నారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి అద్భుత విజయాలను సాధిస్తుందని జోస్యం చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూయిజం, హిందువులు ప్రమాదంలో ఉన్నారని చూపడం బీజేపీ వ్యూహమని, దీనికి ప్రతిపక్షాలను ‘‘హిందూ వ్యతిరేకులు’’గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కీలకమని అభివర్ణించారు.
Read Also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడిని “విలువైన ఆస్తి”గా పరిగణిస్తున్న ఐఎస్ఐఎస్
‘‘నేను అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడటలేను, తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకంగా ఉంది. కేరళలో రెండు పక్షాలు(యూడీఎఫ్, ఎల్డీఎఫ్)లు 20 సీట్లను గెలుచుకుంటాయి. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. 2019 కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి’’ అని ఆయన అన్నారు. 2019లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీల్లో ఇండియా కూటమికి సానుకూల నివేదికలు ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, హిందూ వ్యతిరేకులుగా పీఎం మోడీ ప్రచారం చేయడం బీజేపీ ఎన్నికల వ్యూహమని ఆయన చెప్పారు. హిందూయిజం ప్రమాదంలో లేదని చెప్పారు. కచ్చతీవు దీవి వివాదం ముగిసిపోయిందని, ఎన్నికల సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏంటని చిదంబరం ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు..? అని అడిగారు.