Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిని నిన్న పశ్చిమబెంగాల్ నుంచి అరెస్ట్ చేశారు. అరెస్టైన్ అబ్దుల్ మతీన్ తాహాని ‘‘ అత్యంత విలువైన ఆస్తి’’గా ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మార్చి 1న కేఫ్‌లో బాంబు పెట్టిన తాహా మరియు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌లను కోల్‌కతా సమీపంలోని వారి రహస్య స్థావరం నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శుక్రవారం అరెస్టు చేసింది. శనివారం వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా.. వీరికి 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. శుక్రవారం అర్థరాత్రి బెంగళూర్ తీసుకువచ్చి మడివాడాలోని డిటెన్షన్ సెల్‌కి తరలించారు.
READ ALSO: Bournvita: “బోర్న్‌విటా”ని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..
ఇద్దరు నిందితులను విచారించడంతో పాటు నిందితులను పేలుడు జరిగిన ప్రదేశంతో పాటు బెంగళూర్, చెన్నైలోని వారు బస చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి స్పాట్ ఇంక్వెస్ట్ నిర్వహించారు. గత 5 ఏల్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రాడార్‌లో అబ్దుల్ మతీన్ తాహా ఉన్నాడు. బెంగళూర్ పేలుడుకు ఇతనే ప్లాన్ చేశాడు. నవంబర్ 2022లో మంగళూరులో జరిగిన ఐఎస్ ప్రాయోజిత ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడు, 2022లో శివమొగ్గ ట్రయల్ పేలుళ్లు మరియు 2020లో అల్ హింద్ మాడ్యూల్ కేసుతో తాహాకు సంబంధం ఉంది. అతనికి ఒక ‘‘కల్నల్’’ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఇతని పేరు దక్షిణ, మధ్య భారతదేశంలో అంతటా అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది.
వీరిద్దరికి కల్నల్‌తో సంబంధం, అతనితో ఎన్ని సమావేశాలు జరిగాయి, ఉగ్రవాద కార్యకలాపాలకు చెల్లింపు విధానం, భవిష్యత్ ప్రణాళికలపై ప్రశ్నించాలని ఎన్ఐఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. తాహా, ముస్సావిర్ హుస్సేన్ తమిళనాడుకు ఎలా తప్పించుకున్నారనే విషయాలను కూడా ఎన్ఐఏ రాబడుతోంది. కేఫ్ వద్ద బ్లైండ్ స్పాట్స్‌లని అర్థం చేసుకునేందుకు తాహా ఒక వారం పాటు రెక్కీ నిర్వహించాడు. రెండు వారాల క్రితం అరెస్టైన మరో నిందితుడు ముజమ్మిల్ షరీఫ్ తాహా కోసం హోటల్, నగరం నుంచి ఎలా వెళ్లాలనే దానిపై ప్రత్యేక మార్గాలను రూపొందించాడు. అయితే, బెంగాల్‌లో పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్ పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారా..? లేదా సరిహద్దు అవతలి వైపు నుంచి ఎవరైనా వీరికి సహాయం చేస్తున్నారా..? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక హోం మినిస్టర్ పరమేశ్వర అన్నారు.