CBI Raids Bengal Law Minister In Coal Scam Case: మరో పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసాలు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) అధికారులు దాడులు చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్న మోలోయ్ ఘటక్ మూడు ఇళ్లపై, కార్యాలయాతో పాటు మొత్తం ఏడు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. అసన్‌సోల్, కోల్‌కతా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ మోలోయ్ ఘటక్ ను ప్రశ్నించింది. ఇప్పటికే పలువురు మంత్రులు, త్రుణమూల్ కాంగ్రెస్ నాయకులు పలువురు పలు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో సహా పలువురిపై కేంద్ర ఏజెన్సీలు నిఘా పెంచాయి. ఎస్‌ఎస్‌సి స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. మరో కీలక నేత అనుబ్రత మోండల్ పశువుల అక్రమ రవాణాలో సీబీఐ అరెస్ట్ చేసింది. గతంలో పార్థఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి కోట్ల కొద్దీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది సీబీఐ. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి అక్రమంగా బంగ్లాదేశ్ కు పశువులను అక్రమంగా స్మగ్లింగ్ చేసిస కేసులో అనుబ్రతా మోండల్ ను అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ రెండు కేసులు విచారిస్తోంది. తాజాగా బొగ్గు స్కామ్ లో మరో మంత్రి జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also: Teacher Punished Student: హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. బాలిక మృతి
ఇప్పటికే బొగ్గు కుంభకోణం కేసులో అభిషేక్ బెనర్జీని ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. 2020లో బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కింద నడుస్తున్న పలు కోల్ మైన్ల నుంచి బొగ్గును అక్రమంగా తరలించారనే అభియోగాలు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చిన ఆదాయం త్రుణమూల్ నేతలకు చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. బొగ్గు స్కామ్ కేసులో ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ తన మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది కోల్ స్కామ్ కేసులో 41 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.