CBI questions former J&K Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఆయనను ప్రశ్నించింది. కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ.300 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏప్రిల్ నెలలో సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. మేఘాలయ గవర్నర్ గా ఉన్న ఆయన పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసిన తర్వాత విచారణ ప్రారంభం అయింది. ఆగస్ట్ 23, 2018 నుంచి అక్టోబర్ 30, 2019 మధ్య సత్యపాల్ మాలిక్ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాంట్రాక్టులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,200 కోట్ల విలువైన సివిల్ వర్క్ కాంట్రాక్టుల కేటాయింపులో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై ఏప్రిల్ లోనే సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మేఘాలయ గవర్నర్ గా పదవీ కాలం ముగిసిన నిన్న శనివారం విచారణ జరిపింది. తనను సీబీఐ పిలిచినట్లు.. కేసుకు సంబంధించిన వివరాలను తీసుకున్నారని.. తరుపరి విచారణ సమాచారం తెలియదని.. మాలిక్ చెప్పారు. శనివారం రోజు దీనికి రెండు రోజుల ముందు కూడా మాలిక్ ను సీబీఐ విచారించింది.
గతంలో దీనిపై సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. 2021 రాజస్థాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా పరిశీలనకు రెండు ఫైళ్లు వచ్చాయని.. నేను వాటిని ఆమోదిస్తే ఒక్కోదానికి రూ.150 కోట్లు లభిస్తాయని ఓ సెక్రటరీ చెప్పారని.. అయితే నేను కాశ్మీర్ కు ఐదు కుర్తాలతో వచ్చానని.. వాటితోనే తిరిగి వెళ్తానని చెప్పి ఆఫర్ తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. సత్యపాల్ మాలిక్ ఇటీవల పలు సందర్భాల్లో బీజేపీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై కేంద్రానికి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు.
2017లో బీహర్ గవర్నర్ గా, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు ఈయన హయాంలోనే జరిగింది. మీరట్ విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు మాలిక్. 1974లో ఎమ్మెల్యే అయ్యారు. 1984లో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన భోఫోర్స్ కుంభకోణం తరువాత రాజీనామా చేశారు. 1988 వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ లో చ ేరారు. 1989లో అలీఘర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో బీజేపీలో చేరారు ఆయన. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. ఆ తరువాత పలు రాష్ట్రాలకు గవర్నర్ గా సేవలు అందించారు.