వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించేలా కృషి చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన లాల్ దర్వాజా బోనాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. పూజల అనంతరం ఆయనకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. లాల్‌దర్వాజా బోనాల సందర్బంగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది.
TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..
ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర టూరిజం శాఖ తరపున నిధులు కేటాయిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మరింత వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగేలా చూస్తామన్నారు. లాల్ దర్వాజ బోనాల కమిటీ ఇతర దేవాలయాలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహించాలని ఆయన సూచించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ, హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని ఆయన అన్నారు. కరోనా కష్టకాలం నుంచి ప్రజలను కాపాడాలని… అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధించినట్టు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని దేవిని కోరుకున్నట్లు వెల్లడించారు.