దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈమెయిల్ బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అటు బెంగళూరులోనూ 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Himanta Sarma vs Rahul Gandhi: అవినీతి ఆరోపణలపై నేతల మధ్య మాటల యుద్ధం
శుక్రవారం ఢిల్లీలోని అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో దేశ రాజధాని అంతటా భయాందోళనలు వ్యాపించాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించి విద్యార్థులను బయటకు పంపేసి తనిఖీలు చేపట్టారు. ఈ వారంలో ఇలాంటి బెదిరింపులు రావడం నాలుగోసారి. వరుస బెదిరింపులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి: Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ
అధికారుల సమాచారం ప్రకారం.. 20కి పైగా పాఠశాలలు లక్ష్యంగా బాంబ్ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, ద్వారకలోని జిడి గోయెంకా స్కూల్, ద్వారక ఇంటర్నేషనల్ స్కూల్, గురునానక్ పబ్లిక్ సావరిన్ స్కూల్, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్‌లోని రిచ్‌మండ్ స్కూల్ వంటి పాఠశాలకు బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ బృందాలు పాఠశాలల దగ్గరకు చేరుకుని తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.