పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తేజేంద్రపాల్ సింగ్ బగ్గా అరెస్ట్, విడుదల నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. బగ్గాను అర్ధరాత్రి గురుగ్రామ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆయన వీపు, భుజానికి గాయమైందని లాయర్ చెప్పడంతో.. ఆయన విడుదలకు మేజిస్ట్రేట్ అనుమతించారు. దాంతో బగ్గా ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీలోని తేజేంద్రపాల్ సింగ్ బగ్గా నివాసంలో ఆయన్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను జనక్‌పురి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హర్యానా పోలీసులు.. పంజాబ్ పోలీసులను అడ్డుకున్నారు.
Read Also: COVID-19: కరోనా వేరియంట్లపై అధ్యయనం.. కారణం ఇదే..!
బగ్గాను అరెస్ట్ చేయడంలో సరైన నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. పంజాబ్ పోలీసుల చెర నుంచి ఆయన్ను విడిపించారు. తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేశారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పంజాబ్ పోలీసులు కురుక్షేత్ర ఘటనపై పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. హర్యానా పోలీసుల జోక్యం చట్టాన్ని ఉల్లంఘించడమే అని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. అరెస్ట్ వ్యవహారం అంతా సవ్యంగా ఉందని.. హర్యానా పోలీసులు ఆ ప్రక్రియను ఆలస్యం చేశారన్నారు. ఢిల్లీ పోలీసులు బగ్గాను హర్యానా సరిహద్దు దాటనివ్వవద్దని పంజాబ్ ప్రభుత్వం కూడా కోర్టును అభ్యర్థించింది.
తేజేంద్రపాల్ సింగ్ బగ్గా ఇటీవల కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తర్వాత ట్విట్టర్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలలో మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా బగ్గా రాకపోవడంతో.. పంజాబ్ పోలీసులు.. ఢిల్లీలో ఆయన నివాసానికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గాను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, కనీసం తలపాగా కూడా కట్టుకోనివ్వలేదని బగ్గా తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు పంజాబ్‌లో బీజేవైఎం ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆప్ నేత ఒకరు పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో బగ్గా అరెస్ట్, విడుదల…రాజకీయ దుమారానికి దారితీసింది.