Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం మమతా బెనర్జీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఈ ఘటనపై ఆరోపణలు చేసిన పలువురికి బెంగాల్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి కోల్‌కతా పోలీసులు బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ, కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామి అనే ఇద్దరు వైద్యులకు సమన్లు జారీ చేశారు. ఆదివారం మధ్యహ్నం 3 గంటలకు తమ ముందు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యయేట్ ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాలులో దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా డాక్టర్లు, ప్రజలు బాధితురాలకి న్యాయం చేయాలని నిరసన తెలిపారు.
Read Also: Kolkata rape case: తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!
ఈ కేసులో వైద్యుడు గోస్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదికని చూశానని, ఇందులో బాధితురాలి శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం ఉందని, సామూహిక అత్యాచారానికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు ఉన్నాయని అన్నారు. అయితే, కోల్‌కతా పోలీసులు ఈ వాదనల్ని అవాస్తమని ఖండించారు. పోస్టుమార్టం నివేదికలో అలాంటి ఫలితాలు లేవని, ఇది తప్పుడు సమాచారమని చెప్పారు. బాధితురాలి పేరు, ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని ప్రశ్నించే అవకాశం ఉంది.
అయితే, కోల్‌కతా పోలీసులు తనకు సమన్లు జారీ చేయడంపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘‘ఆర్జీ కర్ కేసులో బాధితురాలు ఇంకా విచారణ కోసం వేచి ఉంది. కానీ కోల్‌కతా పోలీసులు ఇప్పడు ఒకే పని పెట్టుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష నాయకులు, సాధారణ ప్రజల పోస్టులను అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో చూడటానికి ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించింది.’’ అని పోస్ట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరు కావాల్సిందిగా తనకు సమన్లు అందాయని కార్డియాలజిస్ట్ డాక్టర్ సర్కార్ ధృవీకరించారు. ఇదిలా ఉంటే, శనివారం ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సుదీప్ ఘోష్‌ని సీబీఐ అధికారులు వరసగా రెండో రోజు ప్రశ్నించారు. ఆగస్టు 09న ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో వైద్యులు, ఇంటర్న్స్, పోలీసు అధికారులతో సహా 40 మంది వ్యక్తుల్ని సీబీఐ ప్రశ్నిస్తోంది.