Bihar jail inmate swallows mobile phone: బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ డివిజన్ జైలులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మింగేశారు. జైలులో పోలీస్ అధికారులు తనిఖీ చేస్తుండటంతో, తన దగ్గర ఉన్న ఫోన్ దొరుకుతుందనే భయంతో మింగేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇది జరిగిన కొంత సేపటికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఖైదీని ఆస్పత్రికి తరలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ..
గోపాల్ గంజ్ డివిజనల్ జైలులో కైషర్ అలీ అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నాడు. శనివారం అతనికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో సదర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశామని డాక్టర్ సలాం సిద్ధిఖీ తెలిపారు. అతని పొట్టను ఎక్స్ రే తీయగా అందులో మొబైల్ ఫోన్ ఉన్నట్లు కనిపించిందని.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కానిస్టేబుల్ చేతిలో పట్టుబడతాడనే భయంతో తాను మొబైల్ ఫోన్ మింగానని, అయితే కొద్దిసేపటికే తనకు విపరీతమైన కడుపునొప్పి వచ్చిందని ఖైదీ కైషర్ అలీ తెలిపాడు.
జనవరి 17, 2020న హాజియాపూర్ గ్రామ సమీపంలో నార్కోటిక్ పదార్ధాలతో పట్టుబడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గత మూడేళ్లుగా కైషర్ జైలులోనే ఉంటున్నాడు. ప్రస్తుతం ఖైదీ ఆపరేషన్ కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పీఎంసీహెచ్ పాట్నాకు రెఫర్ చేస్తామని చెప్పారు. ఈ ఘటన తర్వాత జైలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కైషర్ చాలా సార్లు జైలుకు వెళ్లాడు. అయితే ఇలా సెల్ ఫోన్ మింగడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఘటనకు ముందు తీహార్ జైలులో కూడా ఇలాంటిదే జరిగింది. ఆ సమయంలో ఖైదీకి శస్త్రచికిత్స చేసి మొబైల్ ఫోన్ ను బయటకు తీశారు వైద్యులు.