Virat Kohli Breaks Sachin Tendulkar’s All-Time Record: స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒక్కొక్కటిగా ప్రపంచ రికార్డులను తుడిచిపెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రికెట్ లోనే అత్యధిక సెంచరీల రికార్డ్ ను కూడా సాధించే అవకాశం ఉంది. తాజాగా మరో రికార్డును విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 వేల పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచారు విరాట్ కోహ్లీ. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజాగా సచిన్ రికార్డును బద్దలు కొట్టారు కోహ్లీ.
Read Also: NASA: విచిత్ర ఆకారంలో గ్రహశకలం.. 2040లో భూమికి అత్యంత సమీపంలోకి..
న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. విరాట్ కోహ్లీ ఈ ఘనతను కేవలం 549 మ్యాచుల్లోనే సాధించారు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరుతో ఉండేది. సచిన్ 25,000 పరుగులను సాధించేందుకు 577 మ్యాచులు తీసుకున్నారు. విరాట్, సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (588 మ్యాచుల్లో), జాక్వెస్ కలిస్ (594 మ్యాచుల్లో), కుమార సంగక్కర (608) మ్యాచుల్లో, మహేల జయవర్ధనే(701 మ్యాచుల్లో) 25,000 పరుగులను పూర్తి చేశారు.
ఇదిలా ఉంటే రెండో టెస్టులో భారత్ విజయం దాదాపు ఖారరు అయినట్లే కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్రా జడేజా, అశ్విన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. దీంతో భారత్ కు కేవలం 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.