సిలికాన్ సిటీ బెంగళూర్ వేసవి కాలం పూర్తిగా రాకముందే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీటి కొరతను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని డ్రై ప్లేసెస్‌కి నీటిని సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రోజూవారీ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ప్రైవేట్ అపార్ట్మెంట్ల సమస్యను మరింత తీవ్రతరం చేసింది. కనకపురా రోడ్‌లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నీటి సంక్షోభం నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలు అక్కడి వాటర్ క్రైసిస్‌ని తెలియజేస్తుంది. కమ్యూనిటీ సభ్యులు డిస్పోజబుల్ ప్లేట్లు, వెట్ వైప్‌లను ఉపయోగించాలని కోరింది.
కమ్యూనిటీ సంఘం అధ్యక్షుడు వసంత్ కుమార్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లోనే ఈ చర్యలు తీసుకోవాలని సూచించామని చెప్పారు. 2,500 యూనిట్లను కలిగి ఉన్న ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ, రెసిడెంట్స్ అసోసియేషన్ అంతర్గత మెసేజుల్లో ఈ ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. నీటి లభ్యత లేని తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ట్యాంకర్లను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో వర్షాకాలం వచ్చేందుకు మరో 4 నెలల సమయం ఉండటంతో నీటిని సంరక్షించడానికి తగు చర్యలు చేపట్టాలని అపార్ట్మెంట్లలోని నివాసితులను కోరారు.
పలువురు టవర్ కాకుండా బకెట్ ద్వారా నీటిని పట్టుకుని స్నానం చేస్తున్నారు. మరికొందరు ఆర్ఓ ప్యూరిఫైయర్ నుంచి వచ్చే మురికి నీటిని కూడా ఆదా చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే భార్యభర్తలు, స్కూల్ పిల్లలు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. బెంగళూర్‌లో తీవ్రమైన నీటి కొరతను పరిష్కరించడానికి సివిల్ అడ్మినిస్ట్రేషన్ వార్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మార్చి 4న తెలిపారు. నగరంలో నీటి కొరతకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి BBMP హెల్ప్‌లైన్‌లు మరియు వార్డుల వారీ ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివకుమార్ చెప్పారు.