Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింస యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. రిజర్వేషన్ల కోటాపై మొదలైన ఉద్యమం, షేక్ హసీనా సీటుకే ఎసరు పెట్టాయి. విద్యార్థుల ప్రధాన డిమాండ్ కారణంగా ఆమె ఆర్మీ హెచ్చరికలతో గద్దె దిగిపోయారు. నిన్న రాజీనామా తర్వాత ఆమె భారత్ చేరారు. ఇక్కడ నుంచి బ్రిటన్ వెళ్లి ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఈరోజు ఆ దేశ పార్లమెంట్‌ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆయన ప్రెస్ సెక్రటరీ షిఫ్లూ జమాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Read Also: Iran: ఇండియా ‘బిగ్ పవర్’’.. ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపగలదు..
ఇదిలా ఉంటే షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన వెనువెంటనే బంగ్లా ప్రెసిడెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ అయిన ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంలో బీఎన్‌పీతో పాటు జమతే ఇస్లామ్ పార్టీ కూడా భాగస్వామ్యం కానున్నాయి. త్రివిద దళాల అధిపతులు, పలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై అధ్యక్షుడు షహబుద్దీన్ చర్చలు జరిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కొద్ది నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్ని నెలల్లలోనే హింసాత్మక ఘటనల కారణంగా హసీనా దేశం వదిలి పారిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉండబోతున్న బీఎన్‌పీ పార్టీతో సహా ఆ పార్టీ చీఫ్ ఖలిదా జియా భారత్ వ్యతిరేకులు. దీంతో పాటు జమాతే ఇస్లామీ పార్టీ కూడా భారత్‌ని ద్వేషించేదే. గతంలో ప్రధానిగా పనిచేసిన ఖలిదా జియా బీఎన్‌పీ, జిమాత్ ఇస్లామీతో పొత్తు పెట్టుకుంది. జమాతే ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంఘమైన ‘‘ ఇస్లామీ ఛత్ర శిబిర్’’ ప్రస్తుతం బంగ్లాదేశ్ నిరసనల్లో ప్రముఖ పాత్ర వహించింది. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో ‘‘ఇండియా అవుట్’’ అనే ప్రచారాన్ని ఈ విద్యార్థి సంఘమే ప్రేరేపించింది. దీని వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందని తెలుస్తోంది.