బెర్త్ ఉన్న రైలు ప్రయాణం ఎంత బాగుంటుందో… బెర్త్ లేకుండా చేసే ప్రయాణం అంతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే రైలులో బెర్త్ దొరికినా.. బాలింతలు చట్టిబిడ్డలతో అవస్థలు పడుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల కోసం రైల్వే శాఖ సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకొని రైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగానే బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్నినార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్త్‌లో అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్‌లో తొలిసారిగా అందుబాటులో ఉంచారు. ఇక్కడ మంచి స్పందన వస్తే ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించేలా యోచిస్తున్నామని అధికారులు వెల్లడించారు. “మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో..లక్నో మెయిల్‌లోని కోచ్ నెం 194129/ B4, బెర్త్ నం 12 & 60లో బేబీ బెర్త్ ప్రవేశపెట్టబడింది. తల్లులు తమ బిడ్డతో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. అమర్చిన బేబీ సీటు కీలులో మడతపెట్టి, స్టాపర్‌తో సురక్షితంగా ఉంటుంది” అని NR యొక్క లక్నో డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ట్వీట్ చేశారు.