Sambit Patra: బీజేపీ నేత సంబిత్ పాత్ర నోరుజారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఒడిశా పూరిలో ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో నిర్వహించారు. దీని తర్వాత మీడియాలో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ పురాతన పట్టణంలో కొలువదీరిన జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని టంగ్ స్లిప్ అయ్యారు. దీనిపై నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్(బీజేడీ) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, తాను జగన్నాథుడిపై ప్రధాని మోడీకి ఉన్న భక్తి గురించి తెలియజేస్తూ పొరపాటున జనన్నాథుడు మోడీ భక్తుడు పేర్కొన్నానని వివరణ ఇచ్చారు.
Read Also: Mahaboobnagar: మహబూబ్ నగర్ లో చికెన్ గున్యా కేసులు.. భయాందోళనలో ప్రజలు
ఇదిలా ఉంటే నోరుజారినందుకు పశ్చాత్తాపంగా ఆయన ‘‘ఉపవాసం’’ ఉంటున్నట్లు ప్రకటించారు. ‘‘నేను చేసిన ఒక ప్రకటన వివాదాన్ని సృష్టించింది, పూరీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో తర్వాత, నేను చాలా మీడియా ఛానెల్‌లకు బైట్ ఇచ్చాను, ప్రధాని నరేంద్ర మోడీ మహాప్రభు జగన్నాథ భక్తుడని ప్రతిచోటా అదే మాట చెప్పాను, అయితే అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యాను. నేను అనుకోకుండా ఈ తప్పు చేుశాను. కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. దీనికి పశ్చాత్తాపంగా జగన్నాథుడి కోసం ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని సంబిత్ పాత్ర చెప్పారు.
సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మహాప్రభు జగన్నాథుడి పవిత్రతను దెబ్బతీస్తాయని అన్నారు. ఇది లక్షలాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. రాజకీయాల్లోకి దేవతలను లాగడం మానుకోవాలని బీజేపీని కోరారు. బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది దేవుడికి అవమానం అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మోడీ భక్తిలో మునిగిపోయిన సంబిత్ పాత్ర పాపం చేశారంటూ విరుచుకుపడింది.