Yogi Adityanath: సనాతన ధర్మాన్ని దూషించడం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి ఉనికిని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతలకు ఫ్యాషన్‌గా మారిందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అన్నారు. సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ మద్దతుదారులు రామభక్తులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులకు హారతి ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నేరస్తులపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ, ప్రతిపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు శ్రీరామ భక్తుల మరనాన్ని జరుపుకుంటాయి, గ్యాంగ్‌స్టర్ మరణానికి మొసలి కన్నీరు కారుస్తాయని ఆయన ఆరోపించారు.
Read Also: Worldcup jersey: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..
సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు ముగిశాయని, దేశం మొత్తం‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదం ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికి సరైన స్థానాన్ని చూపించేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ‘‘రాముడు మరియు కృష్ణుడి గురించి ప్రశ్నలు లేవనెత్తే వారిని మనం ఎలా అంగీకరించగలం? అంతిమంగా, దేశ ప్రజలే వారి ఓట్ల ద్వారా సమాధానం ఇస్తారు’’ అని చెప్పారు.
సీతాపూర్‌లోని పుణ్యక్షేత్రమైన నైమిశారణ్య అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అయోధ్య పునరుజ్జీవం పొందినట్లే నైమిశారణ్య కూడా పరివర్తన చెందుతోందని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎస్పీ యువతకు పిస్టల్స్, ఆయుధాలు అందిస్తే తాము మాత్రం ట్యాబ్‌లు అందిస్తున్నామని యోగి చెప్పారు. భారత విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తోందని, అక్కడ కిలో పిడి కోసం పోరాటాలు జరుగుతున్నాయని, భారత్‌లో మాత్రం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని వెల్లడించారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలకు మద్దతుగా నిలుస్తారని, వారికి చికిత్స అవసరమైన ప్రభుత్వ సౌకర్యాలు, ఆర్థిక సాయం అందేలా చూస్తున్నారని చెప్పారు.