గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11 ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను రైతులు ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ సరిహద్దులు సింఘూ, టిక్రి, గజీపూర్ లలో సంవత్సరంపైగా ఆందోళన చేపట్టిన రైతులు శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం కానున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ సంఘం పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాలు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుంచి పోరుబాట పట్టాయి.
జోరు వాన, తీవ్రమైన చలి, ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఉక్కు సంకల్పంతో ఎన్డీఏ సర్కార్ పై ఒత్తిడి తీసుకువచ్చిన రైతులు తమ పంతం నెరవేర్చుకున్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన మోడీ సర్కారు.. 3 వ్యవసాయ చట్టాలను రద్దుకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రైతు సంఘాల డిమాండ్లపై సానుకూల హామీ లేఖ కూడా ఇచ్చింది. స్వాత్రంత్య భారత దేశ చరిత్రలో అతి సుదీర్ఘమైన రైతు పోరాటంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పోరాటంలో 7 వందల మందికి పైగా రైతులు కన్నుమూశారు. అయితే కేంద్ర ప్రభుత్వ హామీలపై జనవరి 15న సమీక్షకు రైతు సంఘాల భేటీ కానున్నాయి.