అప్పుడప్పుడు మ్యాన్‌హోల్స్‌లో వాహనాలు పడిపోవడం, మనుషులు మునిగిపోవడం లాంటి సంఘటనలు వెలుగుచూడటాన్ని మనం చూశాం. ఇలాంటివి ఎన్ని జరిగినా, ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘోర ప్రమాదమే చోటు చేసుకుంది. ఏకంగా ఓ జంట నీటి గుంతలో పడిపోయింది. అదృష్టవశాత్తూ చుట్టుపక్కలున్న వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. అలీఘఢ్‌లోని కిషన్‌పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలోనే ఆ నీరు పోయేందుకు మ్యాన్‌హోల్స్ తెరిచారు. అయితే, ప్రమాద హెచ్చరికలు మాత్రం పెట్టలేదు. ఈ క్రమంలోనే స్కూటీలో అటుగా వచ్చిన ఓ జంట.. ఆ నీటి గుంతలో పడిపోయింది. ఆ దంపతుల పేర్లు దయానంద్ సింగ్ అత్రి, అంజు అత్రి. స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన ఈ దంపతులు.. రోడ్డు పక్కగా తమ వాహనాన్ని పార్క్ చేసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో ఆ దంపతులు స్కూటీతో పాటు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. అక్కడికి చేరుకొని వారిని కాపాడారు. దీంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. అధికారంలోకి రాకముందు అది చేస్తాం, ఇది చేస్తామంటూ వాగ్ధానాలు చేసే రాజకీయ నాయకులు.. అధికారం వచ్చాక ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్‌హోల్స్‌లో ఏకంగా ఓ జంట పడిపోయిందంటే, అభివృద్ధి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చంటూ కౌంటర్స్ వేస్తున్నారు.
Visuals from UP's Aligarh.
Leaving this here. pic.twitter.com/bOhACL96IW
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2022