Lok Sabha Elections: స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్‌లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ, కేవలం దాదాపుగా 300 స్థానాలకు అటుఇటుగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ ఈసారి కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 2019లో 421, 2014లో 464, 2009లో 440, 2004లో 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇంత తక్కువ సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రధాన విరోధి అయిన బీజేపీ పార్టీ 432 సీట్లలో తమ అభ్యర్థులను నిలిపింది. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 2019లో 52 సీట్లు, 2014లో 44 సీట్లకు పరిమితమైంది. అంతకుముందు 2009లో 206, 2004లో 145 స్థానాలు గెలిచి యూపీఏ కూటమి నేతృత్వంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది.
Read Also: Sanjay Singh : ప్రధాని పిలుపు మేరకే జైల్లోనే కేజ్రీవాల్ హత్యకు కుట్ర : ఆప్ ఆరోపణ
ఈ సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచనతోనే, పొత్తు ధర్మాన్ని పాటించి తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సమర్ధించుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం మైనర్ పార్టీగానే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు దక్కాయి. ఎన్సీపీ-శివసేన(ఉద్ధవ్), సమాజ్‌వాదీ(ఎస్పీ)తో పొత్తుతో తాము తక్కువ సీట్లకే పరిమితమైనట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి జైరాం రమేష్ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 201 స్థానాలు ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాల్లో మిత్రపక్షాలకే గణనీయమైన సీట్లు దక్కాయి. దీంతో కాంగ్రెస్ తక్కవ సీట్లకు పరిమితమైంది. మహారాష్ట్రలో 48 ఏంపీ స్థానాలకు గానూ కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇదే విధంగా యూపీలో 80 స్థానాల్లో 17, బీహార్‌లో 40 స్థానాల్లో 09, తమిళనాడులో 39 స్థానాల్లో 09 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు 42 స్థానాలకు గానూ 13 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఆరు సీట్లు వదులుకుంది.